Meal Maker : మీల్ మేకర్.. ఇవి మనందరికి తెలిసినవే. వీటితో రకరకాల వంటకాలు తయారు చేసుకుని తింటూ ఉంటారు. మీల్ మేకర్ లతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే మనలో చాలా మందికి మీల్ మేకర్ లను ఆహారంగా తీసుకోవాలా వద్దా అని సందేహిస్తూ ఉంటారు. కొందరు వీటిని నాన్ వెజ్ గా భావిస్తూ ఉంటారు. అసలు మీల్ మేకర్ లను తినాలా వద్దా.. వీటిని ఎలా తయారు చేస్తారు. వీటిని తినడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీల్ మేకర్ లు శాఖాహారమే. వీటిని సోయా చిక్కుళ్ల నుండి తయారు చేస్తారు. సోయా చిక్కుళ్ల నుండి నూనెను తీసిన తరువాత మిగిలిన పిప్పితో వీటితో తయారుచేస్తారు. వీటితో కూరలే కాకుండా చిరుతిళ్లను తయారు చేస్తారు.
వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్ వంటి వాటిలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మీల్ మేకర్ లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత ప్రోటీన్ లభిస్తుంది. 100 గ్రాముల మీల్ మేకర్ లలో 52 గ్రాముల ప్రోటీన్, 13 గ్రాముల ఫైబర్, 35 గ్రాముల విటమిన్స్ ఉంటాయి. వీటిలో నాన్ వెజ్ కు సమానమైన ప్రోటీన్ ఉంటుంది. మీల్ మేకర్ లను తీసుకోవడం వల్ల కండరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా మీల్ మేకర్ లను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మీల్ మేకర్ ల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. పురుషులు మాత్రం వీటిని అధికంగా అస్సలు తీసుకోకూడదు. మీల్ మేకర్ లను అధికంగా తీసుకోవడం వల్ల పురుషుల్లో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. పురుషులే కాకుండా స్త్రీలు కూడా వీటిని తగిన మోతాదులో తీసుకోవాలని వారు తెలియజేస్తున్నారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వాపులు, మొటిముల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వాంతులు, మలబద్దకంతో పాటు మూత్ర సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక మీల్ మేకర్ లు మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి వీటిని తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.