Oats Khichdi : మనం ఓట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఓట్స్ ను పాలల్లో వేసి తీసుకోవడంతో పాటు దీనితో ఇతర వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఓట్స్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఓట్స్ కిచిడీ కూడా ఒకటి. ఓట్స్, పెసరపప్పు వేసి చేసే ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఓట్స్ కిచిడీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – ఒక కప్పు, పెసరపప్పు – అర కప్పు, కూరగాయ ముక్కలు ( క్యారెట్, బీన్స్, పచ్చి బఠాణీ ) – అన్నీ కలిపి ఒక కప్పు, మెంతి ఆకులు – అర కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 4, ఉప్పు – తగినంత, అల్లం తురుము – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, నీళ్లు – 4 కప్పులు.
ఓట్స్ కిచిడీ తయారీ విధానం..
ముందుగా పెసరపప్పును కుక్కర్ లో వేసి శుభ్రంగా కడగాలి. తరువాత 2 కప్పుల నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం తురుము, మెంతి ఆకులు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత కూరగాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత రెండు కప్పుల నీళ్లు,ఉప్పు వేసి ఉడికించాలి. నీళ్లు మరిగిన తరువాత ఓట్స్ తో పాటు సగం ఉడికించిన పెసరపప్పు కూడా వేసి కలపాలి. ఇప్పుడు దీనిని చిన్న మంటపై దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ కిచిడీ తయారవుతుంది. అల్పహారంగా లేదా స్నాక్స్ గా దీనిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా ఓట్స్ తో కిచిడీని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.