Omega 3 Fatty Acids : మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అవసరమవుతాయి. మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒకటి. మన శరీరంలో వివిధ అవయవాల పని తీరుకు ఈ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ చాలా అవసరం. మన శరీరంలో తలెత్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా ఈ ఫ్యాటీ యాసిడ్లు మనకు సహాయపడతాయి. మెదడుకు పోషణను అందించడంలో, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎంతో ఉపయోగపడతాయి. మన శరీరానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అలాగే ఇవి ఎక్కువగా ఏయే ఆహార పదార్థాల్లో ఉంటాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా సాల్మన్ ఫిష్, చేపలు, చేప నూనెలో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. అలాగే అవిసె గింజలు, చియా సీడ్స్, వాల్ నట్స్, ఆలివ్ ఆయిల్, బాదం పప్పు వంటి వాటిలో కూడా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ప్రతి ఒక్కరు రోజుకు 1 లేదా 2 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు 3 నుండి 5 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవాలి. ఈ ఆహారాలను తీసుకోలేని వారు మనకు మార్కెట్ లో ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ కూడా లభిస్తూ ఉంటాయి.
వాటిని తీసుకున్నా కూడా మనం మన శరీరానికి తగినంత ఫ్యాటీ యాసిడ్లను అందివచ్చు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గర్భిణీ స్త్రీలు వీటిని తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉండడంతో పాటు వారి మానసిక వికాసం కూడా చక్కగా ఉంటుంది. మతిమరుపు, అల్జీమర్స్ వంటి వాటితో బాధపడే వారు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా సంతాన లేమి సమస్యలతో బాధపడే వారు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవడం వల్ల సమస్యలన్నీ తగ్గు ముఖం పట్టి చక్కటి సంతానాన్ని పొందవచ్చు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గుండె సమస్యలు మన దరి చేరుకుండా ఉంటాయి. అంతేకాకుండా జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా చర్మ సమస్యలు తగ్గి చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈవిధంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తప్పకుండా ప్రతిరోజూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.