Maggi Noodles Pakoda : నూడుల్స్ ను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఉదయం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా తయారు చేసుకుని తింటూ ఉంటారు. నూడుల్స్ రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే చాలా తక్కువ సమయంలో నూడుల్స్ ను తయారు చేసుకోవచ్చు. మనం రకరకాల రుచుల్లో ఈ నూడుల్స్ ను తయారు చేస్తూ ఉంటాం. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ నూడుల్స్ తో మనం పకోడీలను కూడా తయారు చేసుకోవచ్చు. నూడుల్స్ తో చేసే పకోడీలు రుచిగా కరకరలాడుతూ ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. నూడుల్స్ తో పకోడీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాగీ నూడుల్స్ పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
మ్యాగీ నూడుల్స్ – 1, క్యాబేజ్ తరుగు -పావు కప్పు, క్యాప్సికం తరుగు – పావు కప్పు, ఉల్లిపాయ తరుగు – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – అర కప్పు, శనగపిండి – 3 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి- 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.

మ్యాగీ నూడుల్స్ పకోడా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక మ్యాగీ నూడుల్స్ అలాగే మసాలా వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు బాగా ఉడికించాలి. తరువాత నూడుల్స్ ను పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత నూడుల్స్ ను మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. అవసరమైతే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోస్తూ పకోడి పిండిలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ పకోడిల్లా వేసుకోవాలి.
వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మ్యాగీ నూడుల్స్ పకోడా తయారవుతుంది. దీనిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం సమయాల్లో ఇలా నూడుల్స్ తో పకోడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.