French Toast : బ్రెడ్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బ్రెడ్ తో సులభంగా చేసుకోదగిన వంటకాల్లో ఫ్రెంచ్ టోస్ట్ కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో, 5 స్టార్ హోటల్స్ లో లభిస్తూ ఉంటుంది. ఫ్రెంచ్ టోస్ట్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి ఈ ఫ్రెంచ్ టోస్ట్ చాలా చక్కగా ఉంటుంది. రెస్టారెంట్ లలో లభించే విధంగా ఉండే ఈ ఫ్రెంచ్ టోస్ట్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని మనం కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా దీనిని తేలికగా చేయవచ్చు. బ్రెడ్ తో ఎంతో రుచిగా ఉండే ఫ్రెంచ్ టోస్ట్ ను 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రెంచ్ టోస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసెస్ – 4, కోడిగుడ్డు – 1, తేనె – 2 టేబుల్ స్పూన్స్, పాలు – 2 టేబుల్ స్పూన్స్, బటర్ – ఒక టేబుల్ స్పూన్, వెనీలా ఎసెన్స్ – పావు టీ స్పూన్, పంచదార – అర టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పొడి – చిటికెడు, ఉప్పు – చిటికెడు, నూనె – కొద్దిగా.
ఫ్రెంచ్ టోస్ట్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్డును తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి. తరువాత ఇందులో దాల్చిన చెక్క పొడి, పాలు, వెనీలా ఎసెన్స్, పంచదార, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కళాయిలో బటర్, కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత బ్రెడ్ ను కోడిగుడ్డు మిశ్రమంలో రెండు వైపులా ముంచి తీసి కళాయిలో వేసి కాల్చుకోవాలి. ఈ బ్రెడ్ ను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో మరలా బటర్, నూనె వేసి వేడి చేయాలి. తరువాత మిగిలిన బ్రెడ్ స్లైసెస్ ను కూడా ఒక్కొక్కటిగా ఇలాగే కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్రెంచ్ టోస్ట్ తయారవుతుంది. వీటిపై తేనె వేసుకుని సర్వ్ చేసుకుంటే ఈ ఫ్రెంచ్ టోస్ట్ మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఫ్రెంచ్ టోస్ట్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు లేదా బ్రెడ్ తో అప్పుడప్పుడూ ఇలా ఫ్రెంచ్ టోస్ట్ ను తయారు చేసుకుని తినవచ్చు.