Pomegranate Peels : దానిమ్మ పండ్లు అంటే చాలా మందికి ఇష్టమే. వీటిని అందరూ ఇష్టంగానే తింటారు. అయితే దానిమ్మ గింజలను వలిచిన తరువాత మీద ఉండే పొట్టును పడేస్తారు. కానీ ఈ పొట్టు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పొట్టును ఎండబెట్టి పలు విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. కనుక ఇకపై దానిమ్మ పండ్లను తిన్న తరువాత దాని మీద ఉండే పొట్టును పడేయకండి. ఇక దీంతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ పండ్ల పొట్టులో ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, ఇతర ఖనిజాలు, ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, పొటాషియం, పాలీఫినాల్స్, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
దానిమ్మ పండ్ల తొక్కలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో ఒత్తిడి, వాపులు, ఆందోళన తగ్గుతాయి. దానిమ్మ తొక్కలను నీటిలో వేసి మరిగించి డికాషన్‌లా తయారు చేసి తాగవచ్చు. దీంతో దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగాలు రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
దానిమ్మ తొక్కలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. ఇది మనకు ఆరోగ్యాన్ని, అందాన్ని ఇస్తుంది. దానిమ్మ తొక్కలను నీడలో ఎండబెట్టి పొడి చేయాలి. దీంతో ఫేస్ ప్యాక్ తయారు చేసి వాడవచ్చు. దీని వల్ల మీ ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే ముడతలు, మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. దానిమ్మ తొక్క టీ బరువును తగ్గించడంలోనూ సహాయ పడుతుంది. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. ఈ టీని తాగుతుండడం వల్ల గుండె, జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటాయి. విరేచనాలు, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఉన్నవారు దానిమ్మ తొక్కల టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
దానిమ్మ తొక్కలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దానిమ్మ పండు తొక్కల పొడిని జుట్టుకు హెయిర్ ప్యాక్ లా కూడా వాడుకోవచ్చు. ఈ పొడితో దంతాలను కూడా తోముకోవచ్చు. ఇలా దానిమ్మ పండు తొక్కలతో మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కనుక ఇకపై ఈ తొక్కలను పడేయకండి.