Puffy Eyes : మన శరీరంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే మన శరీరం వెంటనే మనకు పలు లక్షణాలను చూపిస్తుంది. వాటిని చూసి అలర్ట్ అయి మనం అందుకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. దీంతో అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక ఒక్కో భాగంలో కనిపించే లక్షణాలను బట్టి మనకు భిన్న రకాల అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలోనే కళ్ల కింద కొందరికి ఉబ్బిపోయినట్లు అవుతుంది.
సాధారణంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే కొందరికి కళ్ల కింద ఉబ్బిపోయినట్లు అవుతుంది. కళ్ల కింద నల్లని వలయాలు వచ్చే చోట వాపులకు గురై కనిపిస్తుంది. అయితే ఇలా అయ్యేందుకు పలు కారణాలు ఉంటాయి. అవేమిటంటే..
రాత్రి పూట నిద్ర సరిగ్గా పోకపోయినా, అధికంగా ఒత్తిడి, ఆందోళనలకు గురైనా, రోజూ ఆలస్యంగా నిద్రపోతున్నా, డీహైడ్రేషన్, నీళ్లను సరిగ్గా తాగకపోవడం, విపరీతంగా పొగ తాగడం లేదా మద్యం సేవించడం, రాత్రి పూట జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, టీవీలను, ఫోన్లను, కంప్యూటర్లను అధికంగా చూడడం.. వంటి పలు కారణాల వల్ల కొందరికి కళ్ల కింద ఉబ్బిపోయినట్లు అవుతుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. కొందరు నీళ్లను సరిగ్గా తాగకపోయినా ఇలా జరుగుతుంది కనుక రోజూ తగినంత నీటిని తాగాలి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కళ్ల కింద వాపులు తగ్గిపోతాయి.
2. రాత్రిపూట త్వరగా నిద్రించాలి. ఉదయం త్వరగా నిద్ర లేవాలి. దీంతో కూడా కళ్ల కింద వాపులు తగ్గుతాయి. ఇక ఫోన్లను, టీవీలను, కంప్యూటర్లను వాడడం తగ్గించాలి. ఇలా చేయడం వల్ల కళ్లు సురక్షితంగా ఉంటాయి. వాపులు రాకుండా ఉంటాయి.
3. పలు రకాల అలర్జీల వల్ల కూడా కళ్ల కింద వాపులు వస్తుంటాయి. కనుక ఇంటిని, ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి లేకుండా నీట్‌గా ఉంచుకోవాలి.
4. మద్యం అధికంగా సేవించడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం మానేయాలి. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవాలి. ఉప్పు వాడకం తగ్గించాలి.
5. ఉదయం నిద్ర లేవగానే కళ్ల కింద ఉబ్బిపోయినట్లు ఉంటే దానిపై ఐస్ క్యూబ్స్‌ను పెట్టాలి. లేదా ఒక స్టీల్ స్పూన్‌ను ఫ్రీజర్‌లో ఉంచి అనంతరం దాన్ని కళ్ల కింద పెట్టవచ్చు. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
6. కీరదోస కాయలను అడ్డంగా చక్రాల్లా కట్ చేసి ఆ ముక్కలను కళ్లపై పెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు ఉండాలి. దీంతో కళ్ల కింద రక్త సరఫరా మెరుగుపడి వాపులు తగ్గిపోతాయి. కళ్లకు చలువ చేస్తుంది.
7. రాత్రిపూట పాలలో కొద్దిగా నీళ్లు కలిపి వాటిని ఐస్ ట్రేలో పోసి ఫ్రీజర్‌లో పెట్టాలి. ఉదయం వరకు అవి మిల్క్ ఐస్ క్యూబ్స్ లా మారుతాయి. వాటిని కళ్ల కింద మర్దనా చేయాలి. దీంతో కళ్ల కింద వాపులను తగ్గించుకోవచ్చు. నేరుగా చల్లని పాలను కూడా వేళ్లతో తీసుకుని కళ్ల కింద రాస్తూ మర్దనా చేయవచ్చు. దీంతోనూ కళ్ల కింద వాపులు తగ్గుతాయి.