Beetroot : బీట్‌రూట్‌ను పోషకాహార నిపుణులు సూపర్‌ఫుడ్‌గా చెబుతుంటారు. అందుకు తగినట్లుగానే అందులో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. బీట్‌రూట్‌లో విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో శరీరం వెచ్చగా ఉంటుంది. అందువల్ల చలికాలంలో బీట్‌రూట్‌ను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
బీట్‌రూట్‌ను రోజూ నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఉడకబెట్టి, రోస్ట్ చేసి, జ్యూస్ రూపంలోనూ తీసుకోవచ్చు. దీంతో అనేక ప్రయోజాలను పొందవచ్చు.
చలికాలంలో బీట్‌రూట్‌ను రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బీట్‌రూట్‌లో ఫైటో న్యూట్రియెంట్లు ఉంటాయి. వీటిని బీటాలెయిన్స్ అని పిలుస్తారు. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు వీటిల్లో ఉంటాయి. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకుపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. దీన్నే డిటాక్సిఫికేషన్ అంటారు.
చలికాలంలో బీట్ రూట్ ను రోజూ తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఈ సీజన్‌లో వచ్చే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దీంతోపాటు కండరాలకు ఆక్సిజన్ సరిగ్గా లభిస్తుంది.
రీడాక్స్ బయాలజీ అనే అధ్యయనంలో ప్రచురించిన వివరాల ప్రకారం.. రోజూ బీట్‌రూట్‌ను తీసుకోవడం వల్ల నోట్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
బీట్‌రూట్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఈ సీజన్‌లో చాలా మందికి ఈ సమస్య వస్తుంది. కనుక బీట్‌రూట్‌ను తింటే జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. పైగా జుట్టు పెరుగుతుంది.
చలికాలంలో గుండె పోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కానీ బీట్‌రూట్‌ను తీసుకోవడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. దీంతో గుండె పోటు ముప్పును నివారించవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చలికాలంలో చర్మం సహజంగానే పగులుతుంది. పొడిబారుతుంది. కానీ బీట్ రూట్‌ను తీసుకోవడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. మృదువుగా మారుతుంది. పొడిదనం తగ్గుతుంది. చర్మం పగలకుండా ఉంటుంది. బీట్‌రూట్‌లో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచుతుంది.
ఇలా బీట్‌రూట్‌ను చలికాలంలో తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.