Sodium Deficiency Symptoms : మన శరీరానికి అనేక విటమిన్స్, మినరల్స్ అవసరం ఉంటుంది. మినరల్స్ విషయానికి వస్తే వాటిల్లో సోడియం ఒకటి. ఇది మన శరీరంలో లోపిస్తే మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇతర పోషకాల మాదిరిగానే మనకు సోడియం కూడా అవసరం అవుతుంది. సోడియం వల్ల మన శరీర కణాలు సరిగ్గా పనిచేస్తాయి. అలాగే నాడీ మండల వ్యవస్థ చురుగ్గా పనిచేయాలన్నా కూడా మనకు సోడియం అవసరం అవుతుంది. ఇక సోడియం లోపిస్తే మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. దీని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.
ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో సోడియం 130 నుంచి 140 మధ్య ఉండాలి. అంతకన్నా మించితే మంచిది కాదు. తక్కువ అయితే లోపం వస్తుంది. మన శరీరంలో సోడియం లోపిస్తే మనకు హైపోనేట్రిమియా (hyponatremia) అనే సమస్య వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల శరీరంలో నీటి శాతం విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో శరీరం ఉబ్బిపోయి కనిపిస్తుంది. ముఖం, కాళ్లు, చేతులు, పాదాల మడమలు ఉబ్బిపోయి కనిపిస్తాయి. అక్కడ నొక్కి చూస్తే చర్మం సొట్టపడి లోపలికి పోతుంది.
సోడియం లోపం వల్ల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతోపాటు మెదడు సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. అలాగే తీవ్రమైన అలసట ఉంటుంది. చిన్న పని చేసినా విపరీతంగా అలసిపోతారు. ఈ లక్షణాలు ఉంటే సోడియం లోపం ఉందని నిర్దారించుకోవాలి. డాక్టర్ సూచన మేరకు చికిత్స తీసుకుంటూ పలు ఆహారాలను తింటుంటే సోడియం లోపం నుంచి బయట పడవచ్చు. ఇక ఇందుకు గాను ఆహారంలో ఉప్పును రోజుకు 5 గ్రాములకు మించకుండా తీసుకోవాలి. ఇందులోనే సోడియం అధికంగా ఉంటుంది. ఉప్పును సరిగ్గా తినకపోయినా సోడియం లోపం వస్తుంది. అలాగని 5 గ్రాములకు మించి తినకూడదు. అలాగే సోడియం లోపం ఉన్నవారు పండ్లు, కూరగాయలు, చెర్రీలు, చేపలు, వేపాకులు, ఫూల్ మఖనా, ధనియాలు, కొత్తిమీర, యాపిల్స్, కీరదోస, క్యాబేజీ, పప్పులు వంటి ఆహారాలను తింటుంటే సోడియం లోపం తగ్గుతుంది.