Dry Grapes : ఎండు ద్రాక్ష.. వీటినే కిస్మిస్ అని కూడా పిలుస్తారు. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు. అయితే వాస్తవానికి వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు శక్తిని, పోషణను అందిస్తాయి. ఎండు ద్రాక్షలను రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వీటిని రాత్రి పూట పాలలో మరిగించి తీసుకుంటే ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రాత్రి పూట ఒక గ్లాస్ పాలలో పది కిస్మిస్‌లను వేసి మరిగించి అనంతరం ఆ పాలను తాగాలి. వాటిలో ఉండే కిస్మిస్‌లను అలాగే పాలు తాగుతూ తినేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. రోజూ నీరసంగా, నిస్సత్తువగా, బలహీనంగా అనిపించే వారు.. రోజూ శారీరక శ్రమ, వ్యాయామం ఎక్కువగా చేసే వారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుంది. దీంతో చురుగ్గా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అంత త్వరగా అలసిపోరు. శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి.
2. పాలలో కిస్మిస్‌లను వేసి మరిగించి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల విటమిన్లు లభిస్తాయి. ముఖ్యంగా బి విటమిన్లు, ఐరన్, పొటాషియం లభిస్తాయి. వీటి వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. ఎముకలు దృఢంగా మారుతాయి.
3. కీళ్ల నొప్పులు ఉన్నవారు రోజూ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది. నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం, వైరల్ ఫీవర్, ఇతర ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే త్వరగా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
4. మలబద్దకంతో బాధపడుతున్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల రోజూ ఉదయాన్నే సుఖంగా విరేచనం అవుతుంది. మలబద్దకం నుంచి బయట పడవచ్చు.
5. దగ్గు, జలుబు సమస్యలు ఉన్నవారు రోజూ ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఆయా సమస్యలు త్వరగా తగ్గుతాయి. ఇక ఈ మిశ్రమం గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తుంది.