Rice And Chapati : చాలా కాలం నుండి అన్నం మన ఆహారంలో భాగంగా ఉంటూ వస్తోంది. కాలానుగుణంగా వచ్చిన మార్పుల కారణంగా మన ఆహారపు అలవాట్లలో కూడా అనేక మార్పులు వచ్చాయి. మనలో చాలా మంది సాయంత్రం అన్నానికి బదులుగా చపాతీలను, పుల్కాలను తింటున్నారు. ఇలా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నం తినడం ద్వారా మనకు 500 క్యాలరీల శక్తి వస్తుంది. చపాతీలను, పుల్కాలను తినడం వల్ల 200 క్యాలరీల శక్తి మాత్రమే వస్తుంది. ఇలా తినడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోకి రావడం, బరువు తగ్గడం వంటివి జరుగుతాయి.
చపాతీలను, పుల్కాలను తినడం కంటే సాయంత్రం భోజనంలో కేవలం పండ్లను తినడం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. చపాతీలను, పుల్కాలను మనం సాధారణంగా కూరతో తింటూ ఉంటాం. ఈ కూరలో ఉప్పు, నూనె, మసాలాలను వాడుతూ ఉంటాం. అలాగే ఈ కూరను వేడి చేసినప్పుడు ఇందులో ఉండే సూక్ష్మ పోషకాలు అన్నీ నశించి పోతాయి. పండ్లను తినడం వల్ల మన శరీరంలోకి ఎటువంటి ఉప్పు, నూనె వెళ్లవు. అలాగే పండ్లల్లో ఉండే సూక్ష్మ పోషకాలు అన్నీ మన శరీరానికి అందుతాయి.
సాయంత్రం భోజనాన్ని (చపాతీలను, పుల్కాలను) మనం 6-7 గంటల మధ్య తినాలి. కానీ అందరికి ఇలా తినడం వీలు కాదు. పండ్లను మనం సాయంత్రం ఏ సమయంలో అయినా తినవచ్చు. అన్నం మానేసి చపాతీలను తినడం వల్ల మనకు కలిగే లాభం కంటే పండ్లను తినడం వల్ల మూడు రెట్ల అధిక లాభం కలుగుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకునేలా పండ్లు సహాయపడతాయి. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ పండ్ల ద్వారా అందుతాయి. శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపించడంలో పండ్లు ఎంతో దోహదపడతాయి. అజీర్తి సమస్యతో బాధపడే వారు సాయంత్రం భోజనంలో కేవలం పండ్లను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు. కనుక సాయంత్రం చపాతీలను, పుల్కాలను తినడం కంటే పండ్లను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.