Foods : వారానికి కనీసం మూడు లేదా నాలుగు సార్లు ఆకు కూరలను తినాలి. వీటిల్లో క్యాల్షియం, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మార్చడంతోపాటు రోగ నిరోధక శక్తిని, కంటిచూపును పెంచుతాయి. అలాగే ఉడకబెట్టిన శనగలు, పల్లీలు, అలచందలు.. వంటి వాటిని వారంలో కనీసం 2 లేదా 3 సార్లు తినాలి. ఇవి శరీరానికి శక్తిని, ప్రోటీన్లను అందజేస్తాయి. దీంతో కండరాల నిర్మాణం జరుగుతుంది. కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.
వారంలో మూడు సార్లు తెల్ల నువ్వుల ఉండలు, పల్లీల ఉండలు, సున్నుండలను తినాలి. వీటిని బెల్లంతో మాత్రమే తయారు చేసి తినాలి. దీంతో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకల పెరుగుదల, నిర్మాణంతోపాటు రక్తం వృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. అలాగే సీజనల్ పండ్లను వారంలో కనీసం 3 సార్లు తినాలి. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
నానబెట్టిన బాదంపప్పులను స్నాక్స్‌లా రోజూ తినాలి. జీడిపప్పు, పిస్తాపప్పు వంటి వాటిని కూడా తినవచ్చు. అయితే జీడిపప్పును తక్కువ మోతాదులో తినాలి. ఇవి అందరికీ పడకపోవచ్చు. కనుక అలర్జీ సమస్య ఉన్నవారు వీటిని తినరాదు. ఇక ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినడం మంచిది. చల్లగా అయ్యేకొద్దీ అందులో బాక్టీరియా పెరిగిపోతుంది. కనుక వేడి ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఇది మనల్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది.