వర్షాకాలం సమయంలో సాయంత్రం పూట సహజంగానే చాలా మంది పలు రకాల జంక్ ఫుడ్స్‌ను తింటుంటారు. వాతావరణం చల్లగా ఉంటుంది కనుక వేడి వేడిగా స్నాక్స్ తినేందుకు ఇష్టపడతారు. రుచి కోసం అలా సహజంగానే చేస్తారు. అయితే వాటి కన్నా కింద తెలిపిన పండ్లను తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ సీజన్‌లో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి అందుకు ఏయే పండ్లను తినాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. పియర్.. దీనినే బేరి పండు అని పిలుస్తారు. వీటిల్లో క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
2. ఏడాది పొడవునా యాపిల్స్ మనకు అందుబాటులో ఉంటాయి. అయితే వీటిని ఈ సీజన్‌లో కచ్చితంగా తినాలి. మిస్ చేయకూడదు. ఈ పండ్లలో విటమిన్లు ఎ, బి 1, బి 2, సి, ఫాస్ఫరస్, అయోడిన్, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముక, చర్మం, కండరాలు, నరాలు, మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కనుక యాపిల్ పండ్లను రోజూ కచ్చితంగా తినాలి.
3. పోషకాలతో సమృద్ధిగా ఉండే దానిమ్మపండు వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి అనారోగ్యాలను రాకుండా చూస్తాయి. బి-విటమిన్లు, ఫోలేట్ లు ఈ పండ్లలో ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి. రక్త ప్రసరణకు సహాయపడతాయి. అందువల్ల ఈ సీజన్‌లో దానిమ్మ పండ్లను కచ్చితంగా తీసుకోవాలి.
4. ఈ సీజన్‌లో మనకు లభించే పండ్లలో నేరేడు పండ్లు ఒకటి. ఇవి జీర్ణక్రియను పెంచుతాయి. ఈ పండ్లలో ఫైబర్ ఉంటుంది. ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. నేరేడు పండ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఈ పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. షుగర్ అదుపులో ఉంటుంది. ఈ సీజన్‌లో ఈ పండ్లను కచ్చితంగా తినాలి.
5. ఈ సీజన్‌లో తినవలసిన పండ్లలో లిచి ఒకటి. వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధులను రాకుండా చూస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల బరువు తగ్గవచ్చు.
6. ఈ సీజన్‌లో కచ్చితంగా తినాల్సిన పండ్లలో బొప్పాయి ఒకటి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం, జుట్టును సంరక్షిస్తుంది. ఈ పండ్లలో ఉండే పపైన్ అనబడే ఎంజైమ్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365