Soya Seeds : ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో సోయాగింజలు కూడా ఒకటి. సోయాగింజలతో చేసిన ఏ ఉత్పత్తులైనా కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సోయా మరియు సోయా ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రోటీన్ లోపంతో బాధపడే వారు సోయా గింజలు, సోయా ఉత్పత్తులను తీసుకోవడం వల్ల చాలా సులభంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అయితే మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి సోయా గింజలు, సోయా ఉత్పత్తులను తీసుకోవడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
వీటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల సమస్యల బారిన పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. సోయాను ఎక్కువగా తీసుకోవడం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోయాను తీసుకోవడం వల్ల కొందరిలో అర్జీలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు ఈ సమస్య బారిన పడేఅవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చర్మంపై దురద, దద్దుర్లు కడుపులో అసౌకర్యంగా ఉండడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలర్జీ సమస్యలు ఉన్నవారు వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి. అలాగే సోయాలో గోయిట్రోజెన్ అనే సమ్మేళనాలు ఉంటాయి.
ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. కనుక సోయాను తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారు అయోడిన్ లోపం వంటి సమస్యలు ఉన్నవారు వైద్యుడు సూచించిన మోతాదులోనే ఈ సోయాగింజలను, సోయా ఉత్పత్తులను తీసుకోవాలి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కనుక హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలతో బాధపడే వారు వీటిని తక్కువగా తీసుకోవడం చాలా అవసరం. అలాగే కొందరిలో సోయా ఉత్పత్తులను తీసుకోవడం వల్ల అజీర్తి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది.
అదే విధంగా సోయాలో ఫైటిక్ యాసిడ్ వంటి యాంటీ న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి మన శరీరం ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. కనుక సోయా ఉత్పత్తులను ఉడికించి, నానబెట్టి,పులియబెట్టి తీసుకోవాలి. ఈ విధంగా సోయా గింజలు, సోయా ఉత్పత్తులు మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి వీటిని తగిన మోతాదులోనే తీసుకోవాలని అలాగే ప్రోటీన్ కోసం పూర్తిగా వీటిపై ఆధారపడకుండా ఇతర ఆహారాలను కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.