Sesame Seeds : వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఎంతోమంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా చలికాలంలో అనేక వ్యాధులు చుట్టుముట్టడం మరింత ఎక్కువ అని చెప్పవచ్చు. చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల చాలా మందికి జీర్ణక్రియ సమస్యలతోపాటు జలుబు, దగ్గు వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. అయితే చలికాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం నువ్వులు ఎంతగానో దోహదపడతాయని చెప్పవచ్చు.
నువ్వులు శరీరంలో వేడిని కలుగజేయడం వల్ల మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి దోహదపడుతాయి. అలాగే నువ్వులలో ఐరన్ అధికంగా ఉండడంతో రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఇది ఒక వరమని చెప్పవచ్చు.
నువ్వులలో ఎక్కువ పోషకాలు ఉండటం వల్ల తరచూ వీటిని తింటుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నువ్వులలో సెసమాల్ అనే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించి మన గుండెని పదికాలాల పాటు పదిలంగా ఉండడానికి కారణం అవుతాయి.
నువ్వులలో ఫైబర్, కాల్షియం అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. జీర్ణక్రియ సమస్యలు లేకుండా తీసుకున్న ఆహార పదార్థాలు తేలికగా జీర్ణం అవుతాయి.
చలికాలంలో మనం విపరీతమైన చలిని ఎదుర్కొంటాం. దాన్ని తగ్గించుకోవాలంటే రోజూ నువ్వులను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని గుప్పెడు మోతాదులో తీసుకుని పెనంపై కొద్దిగా వేయించి తింటే ఎంతో మంచిది. తోడుగా బెల్లంతో కలిపి కూడా వీటిని తినవచ్చు. దీంతో మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.