Tulsi Water : మనం పూజించే మొక్కల్లో తులసి మొక్క ఒకటి. హిందువులు ఈ మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేవాలయాల్లో కూడా తులసి తీర్థాన్ని ఇస్తూ ఉంటారు. ఈ తులసి తీర్థాన్ని తాగడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అలాగే మనం ఇంట్లో కూడా పూజ చేసిన తరువాత అందరికి తులసి తీర్థాన్ని ఇస్తూ ఉంటాం. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. తులసి ఆకుల్లో యూజినాల్, రోజ్ వానిక్ యాసిడ్, ఎపిజినిన్ అనే రసాయన సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. తులసి ఆకులను నీటిలో వేసి గంట పాటు ఉంచడం వల్ల ఈ రసాయన సమ్మేళనాలు నీటిలోకి వస్తాయి. ప్రతిరోజూ గాలి, నీరు, ఆహారం ద్వారా మన శరీరంలోకి రకరకాల క్రిములు ప్రవేశిస్తూ ఉంటాయి.
ఈ క్రిములు మన శరీర కణజాలంలో ఇన్ ప్లామేషన్ కు దారి తీస్తాయి. ఈ ఇన్ ప్లామేషన్ ను ఏ రోజుకు ఆ రోజు శరీరం తగ్గించుకోవడానికి తులసి నీరు అద్భుతంగా పని చేస్తుంది. అలాగే తులసిలో ఉండే లిలిలోనిక్ యాసిడ్, వొలినోయిక్ యాసిడ్ లు రక్తనాళాలను సున్నితంగా తయారు చేస్తాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తనాళాలు గట్టిపడతాయి. రక్తనాళాలు గట్టి పట్టడం వల్ల రక్తప్రసరణ సాఫీగా సాగదు. దీంతో రక్తపోటు, గుండె పోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తులసి నీటిని తాగడం వల్ల గట్టిపడిన రక్తనాళాలు మృదువుగా, సున్నితంగా తయారవుతాయి. దీంతో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది.
అలాగే కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోకుండా చేయడంలో కూడా తులసి నీరు మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా తులసిలో ఉండే ఔషధ గుణాలు కఫాన్ని, శ్లేష్మాన్ని తొలగిస్తాయి. ముక్కులో, గొంతులో, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని తొలగించి శ్వాస నాళాలను శుభ్రపరచడంలో కూడా తులసి నీరు మనకు దోహదపడుతుంది. రోజూ తులసి నీటిని తాగడం వల్ల ఈ ప్రయోజనాలతో పాటు మనం అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ తులసి నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ రాత్రి పడుకునే ముందు గుప్పెడు తులసి ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఈ ఆకులను మూడు లీటర్ల నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ తులసి ఆకులను తీసేసి నీటిని తాగాలి. పరగడుపున ఈ విధంగా తులసి నీటిని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.