Ginger Water : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే అల్లాన్ని వంట ఇంటి పదార్థంగానూ, ఆయుర్వేద ఔషధంగానూ ఉపయోగిస్తున్నారు. అల్లాన్ని మనం పలు రకాల వంటల్లో వేస్తుంటాం. దీంతో వంటలకు చక్కని రుచి వస్తుంది. అయితే అల్లంలో అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల అల్లాన్ని మన పెద్దల కాలం నుంచే తింటున్నారు. ఇక అల్లాన్ని నీటిలో వేసి మరిగించి తాగితే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఈ అల్లం నీళ్లను భోజనం చేసిన అనంతరం తాగాలి. దీంతో ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఇక అల్లం నీళ్లను తాగడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం నీళ్లలో అనేక పోషకాలు..
అల్లంలో అనేక పోషకాలు, సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు సి, బి6లతోపాటు పొటాషియం, మెగ్నిషియం, మాంగనీస్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అల్లంలో ఉండే జింజరాల్, షగోల్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది మంచి జీర్ణకారిగా పనిచేస్తుంది. దీంట్లో ఇమ్యూనిటీని పెంచే గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల అల్లం నీళ్లను తాగితే మనం ఎక్కువగా ప్రయోజనాలను పొందవచ్చు. అల్లం నీళ్లను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. వికారం తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోయి శరీరం అంతర్గతంగా క్లీన్ అవుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. కనుక భోజనం చేసిన అనంతరం రోజూ అల్లం నీళ్లను తాగాలి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది..
అల్లంలో ఉండే జింజరాల్, షోగుల్ అనే సమ్మేళనాలు పలు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో సహాయ పడతాయి. దీంతో మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం అనేవి ఉండవు. అలాగే భోజనం అనంతరం పొట్టలో ఉండే అసౌకర్యం కూడా తొలగిపోతుంది. ఇక కొందరు ఎల్లప్పుడూ వికారంగా ఉందని అంటుంటారు. అలాంటి వారు కూడా భోజనం చేసిన తరువాత అల్లం నీళ్లను తాగాలి. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. వికారం తగ్గుతుంది.
అల్లం నీళ్లను తాగడం వల్ల గుండెల్లో మంట సైతం తగ్గుతుంది. కొందరికి తిన్న వెంటనే గ్యాస్ పైకి వస్తుంది. అలాంటి వారు కూడా అల్లం నీళ్లను తాగడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లం నీళ్లను తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. తద్వారా అధిక బరువు తగ్గుతారు. ఇలా అధిక బరువు తగ్గేందుకు అల్లం నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.
రోగ నిరోధక శక్తికి..
అల్లంలో విటమిన్ సి, జింక్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో సీజనల్ దగ్గు, జలుబు, జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ నీళ్లను తాగితే శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు అన్నీ బయటకు వెళ్లిపోతాయి. దీంతో రోగాలు రాకుండా చూసుకోవచ్చు. అల్లం నీళ్లను తాగితే శరీరంలో రక్తసరఫరా మెరుగు పడుతుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. అలాగే షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. అల్లం నీళ్లను మహిళలు నెలసరి సమయంలో తాగితే ఆ సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభించడంతోపాటు అధిక రక్తస్రావం కాకుండా చూసుకోవచ్చు. ఇలా భోజనం అనంతరం అల్లం నీళ్లను తాగడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
అల్లం నీళ్ల తయారీ ఇలా..
1 ఇంచు తాజా అల్లం ముక్క, 2 కప్పుల నీళ్లను తీసుకోవాలి. అల్లం మీద పొట్టు తీసి దాన్ని దంచాలి. అనంతరం నీళ్లను మరిగించాలి. అందులో అల్లం వేయాలి. దాన్ని 5 నిమిషాల పాటు సిమ్‌లో ఉంచి మరిగించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి నీళ్లను వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇందులో రుచి కోసం కాస్త తేనె కలుపుకోవచ్చు. ఇలా అల్లం నీళ్లను తయారు చేసి భోజనం అనంతరం తాగవచ్చు. అయితే అల్లం ముక్కను నేరుగా కూడా తినవచ్చు. ఇలా తినలేని వారు అల్లం నీళ్లను తాగాలి.