ప్రస్తుత తరుణంలో చాలా మంది ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాల పద్ధతులను పాటిస్తున్నారు. అందులో భాగంగానే తమ ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకుంటున్నారు. ఇక చాలా మంది వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకుంటున్నారు. దీంతో షుగర్, అధిక బరువు తగ్గించుకోవచ్చని చాలా మంది భావిస్తున్నారు. అందుకనే చాలా మందిలో తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి బ్రౌన్ రైస్ తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే మరి అసలు వైట్ రైస్‌కు, బ్రౌన్ రైస్‌కు మధ్య తేడాలు ఏమిటి ? ఎందులో ఏయే పోషకాలు ఎక్కువగా ఉంటాయి ? ఎవరు ఏ రైస్ తింటే మంచిది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
బ్రౌన్ రైస్ అంటే పాలిష్ చేయబడని బియ్యం. సాధారణంగా మనం తినే వైట్ రైస్ బియ్యాన్ని చాలా సార్లు పాలిష్ చేస్తారు. అందుకే అవి తెల్లగా ఉంటాయి. పాలిష్ చేయబడ్డ బియ్యం త్వరగా ఉడుకుతుంది. త్వరగా జీర్ణమవుతుంది. అందుకనే బియ్యానికి పాలిష్ వేస్తారు. అయితే మరలో ఆడించిన బియ్యానికి కేవలం ఒక్కసారి మాత్రమే పాలిష్ వేయగా.. వచ్చే బియ్యాన్ని బ్రౌన్ రైస్ అంటారు. ఇది గోధుమ రంగులో ఉంటుంది. ఈ బియ్యం ఉడికేందుకు సమయం ఎక్కువ పడుతుంది. అలాగే మనం ఈ రైస్‌ను తింటే అది అంత త్వరగా జీర్ణమవ్వదు. ఎందుకంటే.. బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ బియ్యంతో వండిన అన్నాన్ని తింటే.. మనకు కొంచెం అన్నం తిన్నా కడుపు నిండుతుంది. దీనికి తోడు ఈ అన్నం అరిగేందుకు చాలా సమయం పడుతుంది కనుక.. షుగర్ లెవల్స్ కూడా అమాంతం పెరగవు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అందుకనే షుగర్ ఉన్నవారు బ్రౌన్ రైస్ తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక పోషక విలువల విషయానికి వస్తే బ్రౌన్ రైస్‌లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి.
అయితే బ్రౌన్ రైస్‌లో ఆర్సెనిక్ అనే విష పదార్థం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇదొక్కటే ఈ రైస్ ద్వారా మనకు కలిగే నష్టం. అదే వైట్‌రైస్‌లో ఆర్సెనిక్ ఉండదు. కానీ.. దాన్ని అతిగా తింటే అధిక బరువు పెరుగుతారు. డయాబెటిస్ వస్తుంది. ఈ నష్టాలు వైట్ రైస్ వల్ల కలుగుతాయి. అయితే ఆర్సెనిక్ ఉన్నప్పటికీ అది చాలా తక్కువ మోతాదులోనే ఉంటుంది. కనుక బ్రౌన్ రైస్‌ను నిర్భయంగా తినవచ్చు. కాకపోతే దాన్ని రోజుకు ఒకసారి మాత్రమే తీసుకుంటే బెటర్. ఈ క్రమంలో డయాబెటిస్ ఉన్నవారు రోజూ రాత్రి పూట బ్రౌన్ రైస్ తినాలి. అదే బ్రౌన్ రైస్ మంచిది కదా అని చెప్పి ఎక్కువగా తింటే మన శరీరంలో ఆర్సెనిక్ ఎక్కువగా చేరి క్యాన్సర్ బారిన పడతాం. కనుక అతి సర్వత్ర వర్జయేత్ అన్న చందంగా.. దేన్నీ అతిగా తినరాదు. మితంగా తింటేనే మన ఆరోగ్యానికి మంచిది.. అది బ్రౌన్ రైస్ అయినా సరే.. వైట్ రైస్ అయినా సరే.. తక్కువగా తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం..!