Heart Attack : హార్ట్ ఎటాక్ అనేది ప్రస్తుతం సైలెంట్ కిల్లర్‌గా మారింది. దీని బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది వచ్చే వరకు ఎవరికీ తెలియడం లేదు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా హార్ట్ ఎటాక్ బారిన పడి సడెన్‌గా కుప్పకూలి ఆ తరువాత చనిపోతున్నారు. అయితే హార్ట్ ఎటాక్ వచ్చిన వారి పట్ల ఎలా ప్రవర్తించాలి ? ఆ సమయంలో ఏం చేయాలి ? హార్ట్ ఎటాక్ వచ్చిన వారిని ఎలా కాపాడుకోవాలి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హార్ట్ ఎటాక్ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. కనుక ఆ సమయంలో చాకచక్యంగా వ్యవహరించాలి. ఏమాత్రం పొరపాటు చేసినా.. అజాగ్రత్త వహించినా.. వ్యక్తి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే ఏ కారణాల వల్ల అయినా సరే హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ సంభవించినా.. దాదాపుగా ఒకేలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే..
హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వారిలో ఛాతిలో బాగా నొప్పిగా ఉంటుంది. ఛాతిపై బరువు పెట్టినట్లు అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఎడమ చేతికి స్పర్శ ఉండదు. మెడ నుంచి ఎడమ భుజం మీదుగా చేతి కింది వరకు నొప్పిగా ఉంటుంది. సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. తలతిరిగినట్లు అనిపిస్తుంది. వికారం, వాంతులు ఉంటాయి. తీవ్రమైన అలసటగా అనిపిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక గ్యాస్ వస్తుంది. ఇలా హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వారిలో పలు లక్షణాలు కనిపిస్తాయి.
ఇక హార్ట్ ఎటాక్ బారిన పడిన వ్యక్తిని ముందుగా కూర్చోబెట్టాలి. తగినంత రెస్ట్ ఇవ్వాలి. ప్రశాంతంగా ఉండమని చెప్పాలి. బిగుతుగా దుస్తులు ధరించి ఉంటే వదులు చేయాలి. అలాగే వెంటనే ఆంబులెన్స్‌కు ఫోన్ చేయాలి. తరువాత ఆంబులెన్స్ వచ్చే లోగా సీపీఆర్ ఇవ్వాలి. దీని వల్ల ఆ వ్యక్తి స్పృహ కోల్పోకుండా ఉంటాడు.
సీపీఆర్ అంటే Cardiopulmonary Resuscitation అన్నమాట. ఈ విధానంలో వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టి అతని ఛాతిపై గట్టిగా ఒత్తిడిని వెంట వెంటనే కలిగిస్తుండాలి. గుండెపై మర్దనా చేసినట్లు గట్టిగా వత్తాలి. ఈ పనిని వెంట వెంటనే చేయాలి. కనీసం ఒక నిమిషానికి 100 సార్లు ఒత్తిడిని కలిగించాలి. దీంతోపాటు వ్యక్తికి కృత్రిమ శ్వాస అందించాలి. నోట్లో నోరు పెట్టి శ్వాస ఇవ్వాలి.
ఇలా సీపీఆర్ చేసే సమయంలో ఆ వ్యక్తి నోట్లో నుంచి ముందుగా గాలి బయటకు రావాలి. ఇలాంటి సమయంలో కొందరు దగ్గినట్లు చేసి మళ్లీ స్ఫృహలోకి వస్తారు. అలాంటి సమయంలో కృత్రిమ శ్వాస అందించాలి. తరువాత తలను పైకి లేపి శ్వాస సొంతంగా తీసుకునేలా చేయాలి. అయినప్పటికీ స్పృహ రాకపోతే గుండెపై ఒత్తిడిని మళ్లీ కలిగించాలి. ఇలా స్టెప్స్‌ను రిపీట్ చేయాలి.
చివరకు వ్యక్తి స్పృహలోకి వచ్చాక వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి. వ్యక్తికి హార్ట్ ఎటాక్ వచ్చిన తరువాత ఒక గంట లోపు హాస్పిటల్‌కు చేరితే.. అప్పుడు ఆ వ్యక్తికి ప్రాణాపాయం ముప్పు తప్పుతుంది. హార్ట్ ఎటాక్ వచ్చాక మొదటి గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్‌లో గుండెకు ముప్పు తక్కువగా ఉంటుంది. అందుకనే ఆ సమయంలోగా హాస్పిటల్‌లో చేర్పిస్తే ఆ వ్యక్తి బతికేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు గుండెకు కూడా ఎక్కువ నష్టం జరగకుండా ఉంటుంది. ఇలా హార్ట్ ఎటాక్ వచ్చిన వారి పట్ల ప్రవర్తించి వారి ప్రాణాలను కాపాడవచ్చు.
అయితే హార్ట్ ఎటాక్ అనేది ఏ కారణం వల్ల వస్తుందో తెలియదు. కానీ కొన్ని సూచనలు పాటిస్తే ఇది రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంట..
1. పొగ తాగడం, మద్యం సేవించడం మానేయాలి. ఇవి చాలా వరకు హార్ట్ ఎటాక్ లకు కారణమవుతుంటాయి.
2. బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ ఉంటే వాటిని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. లేదంటే ఇవి హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తాయి.
3. అధిక బరువు ఉన్నవారు తగ్గే ప్రయత్నం చేయాలి. రోజూ వ్యాయామం చేయాలి. రన్నింగ్, వాకింగ్, జాగింగ్ వంటి గుండెకు వ్యాయామం జరిగే వాటిని చేయాలి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించవచ్చు.
4. ఆరోగ్యకరమైన పౌష్టికాహారం తీసుకోవాలి. తాజా పండ్లు, చేపలు, కూరగాయలు, తృణ ధాన్యాలను అధికంగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ మానేయాలి.
ఈ సూచనలు పాటిస్తే హార్ట్ ఎటాక్‌లు రాకుండా చాలా వరకు నిరోధించవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.