Cumin : జీలకర్రను మనం రోజువారిగా వంటల్లో వాడుతూ ఉంటాం. మనం వంటల్లో వాడే పోపు దినుసుల్లో జీలకర్ర ఒకటి. మనకు నల్ల జీలకర్ర, మామూలు జీలకర్ర అనే రెండు రకాల జీలకర్ర లభిస్తుంది. నల్ల జీలకర్రను సాజీరా అని కూడా అంటారు. రెండు రకాల జీలకర్రలు కూడా అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఇంటి వైద్యంలో కూడా జీలకర్రను విరివిరిగా ఉపయోగిస్తారు. జీలకర్ర మొక్క సుమారు 30 నుండి 50 సెంటిమీటర్ల ఎత్తు పెరుగుతుంది. ప్రాచీన కాలం నుండి జీలకర్ర వాడుకలో ఉంది.
హిందూ వివాహ సాంప్రదాయంలో జీలకర్ర, బెల్లం కలిపి తలమీద పెట్టడం ఒక ముఖ్యమైన ఘట్టం. జీలకర్రను వాడడం వల్ల చర్మ వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. జీలకర్రను వాడడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కడుపులో నులి పురుగుల నివారణకు జీలకర్ర దివ్యౌషధంగా పని చేస్తుంది. మజ్జిగలో ఇంగువను, జీలకర్రను, సైంధవ లవణాన్ని కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. జీలకర్రతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల గుండె నొప్పి రాకుండా ఉంటుంది. రక్తపోటుతోపాటు చక్కెర వ్యాధి కూడా నియంత్రణలో ఉంటుంది.
శరీరంపై ఏర్పడే తామర, తెల్ల మచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఇటువంటి చర్మ వ్యాధులను త్వరితగతిన గమనించి వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. ఇందుకు గాను సులభమైన పెరటి వైద్యం జీలకర్ర అని చెప్పవచ్చు. చర్మంపై వచ్చే అలర్జీలను కూడా జీలకర్రను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. జీలకర్రను నేతిలో వేయించి మెత్తగా దంచి సైంధవ లవణం లేదా ఉప్పుతో కలిపి రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల స్త్రీలల్లో వచ్చే గర్భాశయ సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ఈ పొడిని మజ్జిగతో లేదా అన్నంతో కలిపి తీసుకోవాలి.
అదే విధంగా జీలకర్రను దోరగా వేయించి అందుకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. ఈ పొడికి తగినంత చక్కెరను, ఆవు నెయ్యిని కలిపి కుంకుడు కాయలంత మాత్రలుగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మాత్రలను రెండు పూటలా రెండు మాత్రల చొప్పున తీసుకోవాలి. దీని వల్ల మూత్ర సంబంధిత వ్యాధులు, మూత్రంలో వేడి, పచ్చదనం తగ్గుతాయి. నీరసం, కాళ్ల నొప్పులు, పైత్యంతో బాధపడుతున్న వారు జీలకర్రను లేదా జీలకర్ర మరియు ధనియాల మిశ్రమాన్ని కలిపి తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. ధనియాలను, జీలకర్రను విడివిడిగా తీసుకుని వేయించి పొడిగా చేయాలి. ఈ పొడిలో తగినంత సైంధవ లవణం లేదా ఉప్పును కలిపి అన్నంతో లేదా మజ్జిగతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ప్రేగులు శుభ్రపడతాయి. రోగాలకు కూడా దూరంగా ఉంటారు.
జీలకర్రను నిమ్మరసంతో కలిపి రెండు పూటలా తినడం వల్ల తల తిరగడం, శరీరంలో వేడి వంటి మొదలగు పైత్య రోగాలు తగ్గుతాయి. అర తులం జీలకర్రను గరిటెలో మాడబెట్టి అందులో అర గ్లాస్ నీరు పోసి చల్లారిన తరువాత తీసుకోవాలి. ఇలా నాలుగు గంటలకొకసారి తీసుకోవడం వల్ల నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. వేయించిన జీలకర్రకు సమానంగా సైంధవ లవణాన్ని కలిపి నూరి సీసాలో భధ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వల్ల వాంతులు తగ్గుతాయి. ఇన్ని ఔషధ గుణాలు ఉన్న జీలకర్రను తప్పనిసరిగా ఆహారంలో భాగంగా తీసుకోవాలని దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.