Non-Stick Cookware : ప్రస్తుత కాలంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండే వారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. మనలో చాలా మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతునే ఉన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానమే రోగాల బారిన పడడానికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. మన ఆహారపు అలవాట్లు, వంట వండే విధానంలో మార్పుల కారణంగానే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. పూర్వకాలంలోనూనె లేకుండానే వంటలు వండేవారు. నూనె వాడకంలోకి రాగానే ఆహార పదార్థాలను తయారు చేయడం చాలా సులభమైంది. కానీ నూనె మన ఆరోగ్యానికి ఎంతో హానిని కలిగిస్తుంది. నూనె వల్ల మన శరీరానికి కలిగే హాని అంతా ఇంతా కాదని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యల బారిన పడడానికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడడానికి నూనె ప్రధాన కారణమని వారు తెలియజేస్తున్నారు. నూనె ఎక్కువగా వాడి తయారు చేసే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలని వారు తెలియజేస్తున్నారు. అలాగే మనం చేసే వంటలలోని ఆహారాలు పాత్రలకు అతుక్కోకుండా ఉండడానికి నూనెను ఎక్కువగా వాడుతూ ఉంటాం. నూనెను ఎక్కువగా వాడడానికి బదులుగా నాన్ స్టిక్ పాత్రలను ఉపయోగించాలని వారు తెలియజేస్తున్నారు. ఆహార పదార్థాలను తయారు చేసుకోవడానికి అనుగుణంగా వివిధ రకాల నాన్ స్టిక్ వస్తువులు మనకు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించడం వల్ల నూనె లేకుండానే మనం వంటలను తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసే వంటల్లో పుల్లని పెరుగును అదే విధంగా నూనెకు బదులుగా మీగడను వేసుకుని కాల్చుకోవడం వంటివి చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం చేసే వంటలు అచ్చం నూనెను ఉపయోగించి చేసిన వంటల మాదిరిగానే రంగు, రుచిలను కలిగి ఉంటాయి.
నూనె వాడకాన్ని తగ్గించడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 100 గ్రాముల నూనెలో 900 క్యాలరీలు ఉంటాయి. ఎంత ఎక్కువగా నూనెను ఉపయోగిస్తే అంత ఎక్కువగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. నూనెను ఎక్కువగా వాడడం వల్లనే మనం రోగాల బారిన ఎక్కువగా పడుతున్నాం. నూనెను ఎక్కువగా వేసి చేసిన పదార్థాలను తినడం వల్ల మనకు అజీర్తి సమస్య వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా నూనెను ఎక్కువగా ఉపయోగించి చేసే పదార్థాల్లో పోషకాలు ఎక్కువగా ఉండవు. ఇలాంటి పదార్థాలను తిన్నాకూడా మన శరీరానికి హాని తప్ప ఎటువంటి మేలు ఉండదు. నూనెను వాడకుండా వంటలు వండడానికే మనం ఎక్కువగా ప్రయత్నించాలని తద్వారా మనతోపాటు మన కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.