జీలకర్రను మనం ఎక్కువగా వంటల్లో వేస్తుంటాం. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. జీలకర్రలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. దీని వల్ల పొట్ట దగ్గరి కొవ్వును కరిగించుకోవచ్చు. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. వికారం, గ్యాస్, మలబద్దకం తగ్గుతాయి. రోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ జీలకర్ర నీటిని తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా జీలకర్రను వేసి బాగా మరిగించాలి. తరువాత వచ్చే మిశ్రమాన్ని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. జీలకర్ర నీటిని రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. జీలకర్ర నీటిని తాగితే అధిక బరువు తగ్గుతారు. దీంతోపాటు అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.
1. జీలకర్ర నీటిని తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్, అజీర్ణం సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇది సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. అందువల్ల కడుపునొప్పి కూడా తగ్గుతుంది. జీలకర్ర నీటిని తాగితే జీర్ణాశయంలో కొన్ని రకాల ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. దీంతో అజీర్ణం సమస్య త్వరగా తగ్గుతుంది.
2. గర్భిణీలు జీలకర్ర నీటిని తాగడం వల్ల వారిలో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కార్బొహైడ్రేట్లను జీర్ణం చేసేందుకు అవసరం అయ్యే ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. దీంతో గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.
3. పాలిచ్చే తల్లులు రోజూ జీలకర్ర నీటిని తాగడం వల్ల పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. జీలకర్రలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనత రాకుండా చూస్తుంది. తల్లీ బిడ్డలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
4. జీలకర్రలో ఐరన్, ఫైబర్‌లు అధికంగా ఉంటాయి. అందువల్ల జీలకర్ర నీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
5. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారికి జీలకర్ర నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. రోజూ పరగడుపునే జీలకర్ర నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీలకర్ర శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
6. శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు జీలకర్ర నీళ్లు పనిచేస్తాయి. ఈ నీటిలో యాంటీ కంజెస్టివ్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఛాతిలో పేరుకుపోయిన మ్యూకస్ కరుగుతుంది. జీలకర్ర నీటిని తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
7. జీలకర్రలో పొటాషియం అధికంగా ఉంటుంది. మన శరీర పనితీరుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. ఉప్పు వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి రక్షిస్తుంది.
8. జీలకర్ర విత్తనాలు సహజసిద్ధంగా శక్తిని పెంచే పదార్థాలుగా పనిచేస్తాయి. జీలకర్రలో అనేక పోషకాలు ఉంటాయి. అవి శరీరానికి శక్తిని అందిస్తాయి. మెటబాలిజం తక్కువగా ఉందనుకునే వారు, శక్తి లేదని, నిస్సత్తువగా, నీరసంగా ఉందని భావించే వారు జీలకర్ర నీటిని తాగితే ఫలితం ఉంటుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి.
9. జీలకర్రలో జీర్ణాశయ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. అలాగే లివర్ లోని విష పదార్థాలను బయటకు పంపించే ఔషధ గుణాలు జీలకర్రలో ఉంటాయి. అందువల్ల జీలకర్ర నీటిని రోజూ తాగితే శరీరంలోని వ్యర్థాలు, లివర్‌లోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
10. మన శరీర పనితీరును మెరుగు పరచడంతోపాటు రక్తాన్ని వృద్ధి చేసేందుకు ఐరన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జీలకర్రలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల జీలకర్ర నీటిని తాగితే ఐరన్ లోపం నుంచి బయట పడవచ్చు. రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది.
11. జీలకర్రలో యాంటీ స్పాస్‌మోడిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఆ నీటిని తాగితే మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి.
12. జీలకర్ర నీరు చర్మానికి పునరుజ్జీవం ఇస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. జీలకర్రలో పొటాషియం, కాల్షియం, సెలీనియం, కాపర్, మాంగనీస్‌లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. జీలకర్ర, పసుపు, కొద్దిగా నీరు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని తరచూ వాడుతుండాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది.
13. జీలకర్రలో విటమిన్ ఇ కూడా అధికంగానే ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీంతో ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. జీలకర్రలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు వృద్ధాప్య ఛాయలను రాకుండా చూస్తాయి. దీంతో యవ్వనంగా ఉంటారు. వయస్సు మీద పడినా చర్మం అంత త్వరగా ముడతలు పడదు.
14. జీలకర్రలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఆ నీటిని తాగితే మొటిమలు తగ్గుతాయి. చర్మంపై మచ్చలు ఉండవు. జీలకర్రలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.
15. జీలకర్రలో ఉండే పోషకాలు శిరోజాల సంరక్షణకు మేలు చేస్తాయి. జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని వల్ల జుట్టు పలుచబడడం, జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి. జీలకర్రలో ఉండే ప్రోటీన్లు, ఫ్యాట్స్, నీరు, కార్బొహైడ్రేట్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టును కుదుళ్ల నుంచి దృఢంగా మారుస్తాయి.