మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో రోజూ చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేసేందుకు కావల్సిన యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తుంది. యాంటీ బాడీలు ఎక్కువగా ఉంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్నట్లు లెక్క. దీంతో ఎలాంటి బాక్టీరియా, వైరస్‌లు మనల్ని ఏమీ చేయలేవు. ఇన్‌ఫెక్షన్లు, అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరిగేలా చూసుకోవాలి. అందుకు గాను ఏయే ఆహారాలను రోజూ ఎంత పరిమాణంలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నట్స్
వాల్ నట్స్, జీడిపప్పు, పిస్తా, బాదం పప్పు.. నట్స్ విభాగానికి చెందుతాయి. వీటిని రోజూ 3-4 చొప్పున తీసుకోవచ్చు. అన్నింటినీ కలిపి అయితే గుప్పెడు తినాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
విత్తనాలు
గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా సీడ్స్, అవిసె గింజలు ఈ విభాగానికి చెందుతాయి. వీటిని 2 టీస్పూన్ల చొప్పున తీసుకోవచ్చు. అన్నీ కలిపి అయితే వీటిని కూడా గుప్పెడు మోతాదులో తీసుకోవచ్చు. దీని వల్ల పోషకాలు, శక్తి లభించడంతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
పండ్లు
విడి విడిగా అయితే ఏదైనా ఒక పండును రోజూ తినవచ్చు. కానీ కలిపి అయితే అన్నింటినీ ముక్కలుగా చేసి ఒక కప్పు మోతాదులో అన్నింటినీ కలిపి సలాడ్ రూపంలో తీసుకోవడం ఉత్తమం. దీంతో అన్ని పండ్లలోని పోషకాలు లభిస్తాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మాంసం
చికెన్, మటన్, చేపలు ఇలా ఏ మాంసాహారం అయినా రోజుకు 75 గ్రాముల చొప్పున తీసుకోవచ్చు. అదే గుడ్డు అయితే ఒక ఉడకబెట్టిన గుడ్డును తీసుకోవాలి.
మసాలా దినుసులు
దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సోంపు గింజలు, మిరియాలు, అల్లం, పసుపు.. ఈ కోవకు చెందుతాయి. వీటిని విడి విడిగా అయితే నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తీసుకోవచ్చు. లేదా అర టీస్పూన్ మోతాదులో దేన్నయినా సరే తేనెతో తీసుకోవచ్చు.
ఆకులు
తులసి ఆకులు, వేపాకులు, కరివేపాకులు.. ఇలా ఆకులనే ఉదయాన్నే నేరుగా 4-5 తీసుకుని పరగడుపునే నమిలి మింగవచ్చు. రసం అయితే 1 టీస్పూన్ చాలు. నీటిలో ఆకులను వేసి మరిగిస్తే ఒక కప్పు మోతాదులో తాగితే సరిపోతుంది. అదే జ్యూస్ అయితే పరగడుపునే 30 ఎంఎల్ చాలు.
ఇతర పదార్థాలు
రోగ నిరోధక శక్తి పెరిగేందుకు పరగడుపున ఉసిరి కాయ జ్యూస్‌ను 30 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగవచ్చు. నిమ్మరసంకు బదులుగా తేనె కలిపి కూడా తాగవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో లేదా రాత్రి నిద్రకు ముందు పాలలో మిరియాల పొడి లేదా పసుపు కలిపి తాగవచ్చు.
ఇలా ఆయా పదార్థాలను మీకు నచ్చిన విధంగా, మీకు సౌకర్యంగా ఉండే విధంగా రోజూ తీసుకోవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.