జుట్టు బాగా రాలుతుందా ? జుట్టు సమస్యలు ఉన్నాయా ? అయితే మీరు ఆరోగ్యవంతమైన ఆహారాలను రోజూ తీసుకోవాలి. పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు సమస్యలు వస్తుంటాయి. అందువల్ల ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల జుట్టు పెరుగుదల సరిగ్గా ఉంటుంది. శిరోజాలు దృఢంగా మారుతాయి. వెంట్రుకలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
1. జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఖనిజాలను కోల్పోవడం. ఫోలేట్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి తదితర పోషకాల లోపం వల్ల జుట్టు రాలుతుంది. కనుక వీటిని మనకు అందేలా చూసుకోవాలి. అందుకు గాను పాలకూరను తీసుకోవాలి. పాలకూరలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయ పడతాయి. పాలకూర జుట్టుకు సహజసిద్ధమైన కండిషనింగ్‌ను అందిస్తుంది. పాలకూరలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.
2. దాల్చిన చెక్కను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా జుట్టు సమస్యలు ఉండవు. జుట్టు బాగా పెరుగుతుంది.
3. ప్రతి ఒక్కరూ ఆహారంలో రోజూ నట్స్ ఉండేలా చూసుకోవాలి. బాదంపప్పు, పిస్తాపప్పు వంటివి నట్స్ కిందకు వస్తాయి. వీటిల్లో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
4. సోయాబీన్‌లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జీవక్రియలు మెరుగు పడతాయి. గుండె ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. శిరోజాలు దృఢంగా పెరుగుతాయి.
5. కోడిగుడ్లలో బయోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయ పడుతుంది. గుడ్లలో ఉండే ప్రోటీన్లు, జింక్, సెలీనియం జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల గుడ్లను నిత్యం తీసుకోవాలి.
6. చేపలలో ఒమెగా 3, ఒమెగా 6 తదితర ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ డి, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచేలా చూస్తాయి. శిరోజాలకు కాంతిని అందిస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కనుక చేపలను తరచూ ఆహారంలో తీసుకోవాలి.