యాపిల్ పండ్లను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం విదితమే. ఈ పండ్లలో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే యాపిల్ పండ్లతో టీ తయారు చేసుకుని తాగవచ్చు. ఈ క్రమంలోనే ఆ టీని ఎలా తయారు చేయాలి ? దాంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ పండ్లతో టీ ని తయారు చేయడం చాలా సులభమే. అందుకు గాను ఒక యాపిల్ పండు, 3 కప్పుల నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా దాల్చిన చెక్క పొడి అవసరం అవుతాయి. యాపిల్ పండును ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పాత్రలో నీటిని తీసుకుని అందులో యాపిల్ పండు ముక్కలను, దాల్చిన చెక్క పొడిని వేయాలి. తరువాత బాగా మరిగించాలి. అనంతరం అందులో నిమ్మరసం కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా యాపిల్ పండ్లతో టీ తయారు చేసుకుని తాగవచ్చు.
1. ఈ టీని తాగడం వల్ల విటమిన్ సి బాగా లభిస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చు.
2. కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నవారు ఈ టీని రోజూ తాగితే ఫలితం ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
3. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ టీని తాగితే ఎంతో ఉపయోగం ఉంటుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. గ్యాస్, మలబద్దకం సమస్యలు ఉండవు.
4. డయాబెటిస్ ఉన్నవారు ఈ టీని తాగడం వల్ల షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు.
5. అధిక బరువు ఉన్నవారు యాపిల్ పండ్ల టీని తాగితే బరువును తగ్గించుకోవచ్చు.