మిల్లెట్స్.. చిరుధాన్యాలు.. వీటినే సిరిధాన్యాలు అని కూడా అంటారు. వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. చిరు ధాన్యాలను రోజూ తినడం వల్ల అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఇవి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. దీంతో శరీరానికి పోషణను అందిస్తాయి. శక్తిని ఇస్తాయి. ఉత్సాహంగా ఉంచుతాయి.
రోజూ శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు, వ్యాయామం ఎక్కువగా చేసే వారు, బయట ఎక్కువగా తిరిగే వారు.. నీరసంగా ఉంటుందని, త్వరగా అలసిపోతున్నామని, శక్తి లేకుండా అవుతున్నామని.. బాధపడుతుంటారు. అలాంటి వారు చిరు ధాన్యాలతో చేసే మజ్జిగను తాగితే ఎంతో ఫలితం ఉంటుంది. మరి ఆ మజ్జిగను ఎలా తయారు చేయాలంటే..
మందపాటి అడుగు ఉన్న గిన్నె తీసుకుని రెండు టీస్పూన్ల సజ్జ పిండిని తీసుకుని నూనె లేకుండా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత సరిపడా నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి. రెండు టీస్పూన్ల సజ్జ పిండికి కప్పు నీల్లు సరిపోతాయి. ఒక పొంగు రాగానే మంట తగ్గించి దీనికి కప్పు మజ్జిగ కలిపి పెట్టుకోవాలి.
తరువాత మరో నిమిషం పాటు ఉడికించి దించి చల్లార్చుకోవాలి. దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక టీస్పూన్ నిమ్మరసం, సన్నగా తరిగిన అల్లం, పావు టీస్పూన్ అల్లం రసం కలుపుకోవాలి. దీంతో మిల్లెట్స్ మజ్జిగ తయారవుతుంది.
ఈ విధంగా తయారు చేసుకున్న మిల్లెట్స్ మజ్జిగను రోజూ తాగవచ్చు. ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో దీన్ని తీసుకుంటే శరీరానికి పోషకాలు, శక్తి రెండూ లభిస్తాయి. దీంతో ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. అలసట, నీరసం తగ్గుతాయి.
అయితే సజ్జ పిండినే వాడాలని ఏమీ లేదు. దానికి బదులుగా ఇతర చిరు ధాన్యాలకు చెందిన ఏ పిండిని అయినా వాడవచ్చు. ఈ విధంగా వాటితో మజ్జిగ తయారు చేసుకుని రోజూ తాగవచ్చు. దీని వల్ల శక్తి లభిస్తుంది.