గ్రీన్ టీ అంటే చాలా మందికి ఇష్టమే. కొందరు దీన్ని టేస్ట్ కోసం తాగుతారు. ఇంకొందరు ఆరోగ్యకర ప్రయోజనాలను పొందడం కోసం తాగుతారు. అయితే చలికాలం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు యత్నిస్తున్నారు. అందులో భాగంగానే అనేక రకాల పద్ధతులను పాటిస్తున్నారు. కొందరు శరీరం వెచ్చదనం కోసం పలు ప్రత్యేకమైన పదార్థాలను తీసుకుంటున్నారు. కానీ గ్రీన్ టీతో మసాలా గ్రీన్ టీ తయారు చేసుకుని తాగితే దాంతో శరీరానికి బాగా వెచ్చదనం లభిస్తుంది. మరి ఆ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
మసాలా గ్రీన్ టీ తయారీకి కావల్సిన పదార్థాలు:
* గ్రీన్ టీ ఆకులు అయితే ఒకటిన్నర టీస్పూన్, గ్రీన్ టీ బ్యాగ్ అయితే 1
* నీళ్లు – ఒకటిన్నర కప్పు
* దాల్చిన చెక్క స్టిక్ – 1
* లవంగాలు – 2
* తురిమిన అల్లం – 1 టీస్పూన్
* లెమన్ గ్రాస్ – అర టీస్పూన్
* ఆరెంజ్ జ్యూస్ – 1 టేబుల్ స్పూన్
* తేనె – రుచికి సరిపడా
మసాలా గ్రీన్ టీని తయారు చేసే విధానం:
ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, లెమన్ గ్రాస్ వేసి మరిగించాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి అందులో గ్రీన్ టీ ఆకులు వేయాలి. 2-3 నిమిషాలు అలాగే ఉంచాలి. గ్రీన్ టీ ఆకులకు బదులుగా గ్రీన్ టీ బ్యాగ్ వేయవచ్చు. తరువాత టీని వడకట్టి కప్పులోకి తీసుకుని అందులో నారింజ పండు జ్యూస్ లేదా తేనె కలుపుకుని తాగేయాలి. దీంతో చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. అలాగే గ్రీన్ టీ ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
మసాలా గ్రీన్ టీ తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. దీంతోపాటు గ్రీన్ టీ కనుక దాని లాభాలు కూడా కలుగుతాయి. అధిక బరువు తగ్గవచ్చు. శరీర మెటబాలిజం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.