Munagaku Kashayam : అధిక బరువును తగ్గించడంలో, పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించడంలో మునగాకు ఎంతో సహాయపడుతుందని మనందరికీ తెలుసు. మునగ చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుందని, ఆయుర్వేదంలో కూడా దీనిని ఉపయోగించి ఔషధాలను తయారు చేస్తారని, జబ్బులను నయం చేస్తారని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మునక్కాయలతో మనం వంటలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అయితే మునగాకుతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ మునగాకు కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీన్ని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకు కషాయాన్ని తయారు చేయడానికి.. ఒక గుప్పెడు మునగాకులను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. తరువాత రెండు గ్లాసుల నీళ్లను పోసి ఆ నీరు ఒక గ్లాసు అయ్యే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మునగాకుల కషాయం తయారవుతుంది. దీన్ని రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
మునగాకు కషాయాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గుతాయి. బీపీని నియంత్రించడంలో, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా మునగాకు కషాయం సహాయపడుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాలేయం పని తీరును, మెదడు పనితీరును మెరుగుపరచడంలోనూ మునగాకు కషాయం ఉపయోగపడుతుంది.
మనగాకు కషాయం యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరస్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తాగడం వల్ల వైరస్, బాక్టీరియాల వచ్చే రోగాలు రాకుండా ఉంటాయి. కిడ్నీల పని తీరును మెరుగుపరచడంలోనూ మునగాకు కషాయం దోహదపడుతుంది. ఈ కషాయాన్ని రోజూ తాగడం వల్ల సంతాన లేమి సమస్యలు తగ్గడంతో పాటు, పురుషులలో వీర్య వృద్ది కూడా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మునగాకుతో కషాయాన్ని మాత్రమే కాకుండా పప్పు, కారం, పరోటా వంటి వాటిని కూడా తయారు చేసుకోవచ్చు. ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో మునగాకును కానీ, మునక్కాయలను కానీ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.