Brown Rice : బ్రౌన్ రైస్.. ఇది మనందరికీ తెలిసినవే. ధాన్యాన్ని పాలిష్ చేయకుండా కేవలం పైన ఉండే పొట్టును మాత్రమే తొలగించడం వల్ల వచ్చిన బియ్యాన్నే బ్రౌన్ రైస్ అంటారు. వీటినే దంపుడు బియ్యం, ముడి బియ్యం అని కూడా పిలుస్తారు. మన పూర్వీకులు వీటినే ఎక్కువగా తినేవారు. ప్రస్తుతం మనం ఆహారంగా తీసుకుంటున్న తెల్ల బియ్యం వల్ల మనకు పోషకాలు తక్కువగా అందుతాయి. అంతేకాకుండా బరువు పెరగడంతోపాటు షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. బ్రౌన్ రైస్ ను పాలిష్ చేయరు. కనుక ఈ బియ్యంలో పోషకాలు అధికంగా ఉంటాయి.
తెల్ల బియ్యంలో ఉండే పరిమాణంలోనే వీటిలో క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికి ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. బ్రౌన్ రైస్ లో మెగ్నిషియం, ఫాస్పరస్, సెలీనియం, థయామిన్, నియాసిన్, విటమిన్ బి6 లతోపాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. బ్రౌన్ రైస్ లో గ్లూటెన్ ఉండదు. బ్రౌన్ రైస్ ను చాలా సులువుగా వండుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ ను తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో రెండున్నర గ్లాసుల నీళ్లను పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తరువాత నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ ను వేసి ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల మెత్తగా.. పొడి పొడిగా ఉండే బ్రౌన్ రైస్ అన్నం తయారవుతుంది. దీనిని ఏ కూరతోనైనా తినవచ్చు.
బ్రౌన్ రైస్ ను ఆహారంగా తీపుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. బ్రౌన్ రైస్ ను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. దెబ్బలను, గాయాలను త్వరగా మానేలా చేసే శక్తి బ్రౌన్ రైస్ కు ఉంది. బ్రౌన్ రైస్ ను వండుకుని తినడం వల్ల బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుక తెల్ల బియ్యంతో వండిన అన్నం కంటే బ్రౌన్ రైస్ తో వండిన అన్నాన్ని తినడం వల్ల మనం రోగాల బారిన పడకుండా ఉంటాము.