Ragi Sharbat : చిరు ధాన్యాల్లో ఒకటైన రాగులు మన శరీరానికి అందించే మేలు అంతా ఇంతా కాదు. రాగులతో చాలా మంది జావ చేసుకుని తాగుతారు. కొందరు రాగి ముద్దలు తింటుంటారు. ఇంకా కొందరు రాగి రొట్టెలను తయారు చేసుకుని తింటుంటారు. అయితే రాగులతో కమ్మని షర్బత్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని చల్ల చల్లగా తాగితే ఎండల తాకిడికి తట్టుకోవచ్చు. శరీరం చల్లగా ఉంటుంది. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. మరి రాగుల షర్బత్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
రాగుల షర్బత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగులు -150 గ్రాములు, బెల్లం – 100 గ్రాములు, యాలకులు – 5, జీడిపప్పు – 25 గ్రాములు, బాదంపప్పు – 25 గ్రాములు, నీరు – 1 లీటర్, నిమ్మకాయ – 1.
రాగుల షర్బత్‌ను తయారు చేసే విధానం..
ముందుగా రాగులను శుభ్రం చేసి ఉదయం నీటిలో నానబెట్టాలి. రాత్రికి నీరంతా వంపేసి, మూతపెట్టి ఉంచితే తెల్లారేసరికి మొలకలు వస్తాయి. వీటిని బట్టమీద వేసి ఆరనివ్వాలి. బాగా ఆరిన తరువాత బాణలిలో వేసి కమ్మని వాసన వచ్చే వరకు వేయించాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తనిపొడిలా తయారు చేసుకోవాలి. బాదంపప్పు, జీడిపప్పులను 4 గంటల పాటు నానబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక లీటర్ నీటిలో రాగిపిండి, బెల్లం బాగా కలిసేవరకు కలపాలి. దానికి బాదం, జీడిపప్పు ముక్కలు కలిపి, యాలకుల పొడి వేసి ఒక నిమ్మకాయ రసం పిండి ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లగా అయ్యాక తాగితే చాలా బాగుంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి.
రాగుల షర్బత్‌ను ఇలా తయారు చేసుకుని రోజూ మధ్యాహ్నం తాగాలి. భోజనం చేసిన తరువాత 1 గంట విరామం ఇచ్చి ఈ షర్బత్‌ను తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయి. శరీరంలోని వేడి మొత్తం పోతుంది. చల్లగా మారుతుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. బయటకు వెళితే ఎండదెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తారు.