వేసవిలో చాలా మంది శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆహారాలను, పానీయాలను తీసుకుంటుంటారు. వాటిల్లో రాగుల షర్బత్ కూడా ఒకటి. నిజానికి ఈ సీజన్‌లో చాలా మంది రాగులతో చేసే జావను తాగుతారు. అయితే దాంతోపాటు రాగుల షర్బత్‌ను కూడా తీసుకోవచ్చు. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరం చల్లగా మారుతుంది. డీహైడ్రేషన్, ఎండ దెబ్బ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మరి రాగుల షర్బత్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ముందుగా రాగులను శుభ్రం చేసుకుని ఉదయం నీటిలో నానబెట్టాలి. రాత్రికి నీరంతా వంపేసి మూతపెట్టి ఉంచితే తెల్లారేసరికి మొలకలు వస్తాయి. వాటిని బట్టమీద వేసి ఆరనివ్వాలి. బాగా ఆరిన తరువాత బాణలిలో వేసి కమ్మని వాసన వచ్చే వరకు వేయించాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి. అనంతరం బాదంపప్పు, జీడిపప్పులను 4 గంటలపాటు నానబెట్టాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తరువాత ఒక లీటర్ నీటిలో రాగి పిండి, బెల్లం వేసి బాగా కలపాలి. అందులో బాదం, జీడిపప్పు ముక్కలను కలిపి యాలకుల పొడి వేసి ఒక నిమ్మకాయ రసం పిండి ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లగా అయ్యాక తాగితే చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365