Belly Fat : పొట్ట దగ్గరి కొవ్వును, అధిక బరువును తగ్గించుకోవాలని సహజంగానే చాలా మందికి ఉంటుంది. కానీ కొందరు ఎంత ప్రయత్నించినా వాటిని తగ్గించుకోలేకపోతుంటారు. అయితే ఈ సమస్యకు బార్లీ గింజలు చక్కని పరిష్కారం అందిస్తాయని చెప్పవచ్చు. బార్లీతో తయారు చేసే ఈ వంటకాన్ని రోజూ తిన్నట్లయితే అధిక బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది. మరి దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
బార్లీ దాలియా తయారీకి కావల్సిన పదార్థాలు..
బార్లీ రవ్వ – అర కప్పు, పల్లీలు – అర కప్పు, టమాటాలు తరిగింది – ఒకటి, క్యారెట్లు తరిగినవి – పావుకప్పు, క్యాప్సికమ్ తరిగింది – పావు కప్పు, కాలి ఫ్లవర్ తరిగింది – పావు కప్పు, జీలకర్ర – అర టీస్పూన్, నెయ్యి – 1 టీస్పూన్, అల్లం పేస్ట్ – 1 టీస్పూన్, పచ్చి మిరపకాయలు – 2, కొత్తిమీర తరిగింది – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా.
బార్లీ దాలియా తయారు చేసే విధానం..
ముందుగా బార్లీ రవ్వను శుభ్రం చేసుకోవాలి. దాన్ని పెనంపై వేసి మీడియం మంటపై బ్రౌన్ కలర్లోకి మారే వరకు వేయించుకోవాలి. తరువాత ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఒక టీస్పూన్ నెయ్యి వేసి మీడియం మంటపై వేడి చేయాలి. అనంతరం అందులో అర టీస్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర శబ్దం చేస్తున్నప్పుడు అందులో తరిగిన క్యాప్సికం, క్యారెట్, కాలిఫ్లవర్, పల్లీలు వేసి వేయించాలి.
కూరగాయలను ఉడికించాక అందులో అల్లం పేస్ట్, తరిగిన పచ్చి మిరపకాయలు, ఉప్పు వేయాలి. తరువాత మళ్లీ ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి. అనంతరం బార్లీ రవ్వ, తరిగిన టమాటాలను వేయాలి. ఒక కప్పు నీళ్లు పోయాలి. రవ్వకు మూడు రెట్లు ఎక్కువ మోతాదులో నీళ్లను పోయాల్సి ఉంటుంది. తరువాత కుక్కర్ మూత పెట్టి గ్యాస్‌ను ఎక్కువ మంట మీద సెట్ చేయాలి.
ఒక విజిల్ రాగానే గ్యాస్ ఆఫ్ చేయాలి. కుక్కర్లో నుంచి ప్రెషర్ ను బయటకు పంపాలి. తరువాత మూత తీస్తే వేడి వేడి బార్లీ దాలియా రెడీ అయినట్లే. దీన్ని రోజూ బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఒక కప్పు మోతాదులో తినాలి. దీంతో అధిక బరువు, పొట్ట దగ్గరి కొవ్వు కరగడమే కాక.. పోషకాలు లభిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.