Chepala Iguru : చేపలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. నాన్ వెజ్ అంటే ఇష్టపడేవారు చాలా మంది చేపలను తింటుంటారు. అయితే చేపలను ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. వాటిల్లో చేపల ఇగురు ఒకటి. దీన్ని ఎలా తయారు చేయాలో చాలా మందికి తెలియదు. కానీ ఈ వంటకం రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి చేపల ఇగురును ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
చేపల ఇగురు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేప ముక్కలు – అర కిలో, ఉల్లిపాయలు – 4, పచ్చి మిర్చి – 6, కారం – 2 టీస్పూన్లు, జీలకర్ర పొడి – 1 టీస్పూన్, ధనియాల పొడి – 1 టీస్పూన్, పసుపు – 1 టీస్పూన్, టమాటాలు – 2, అల్లం వెల్లుల్లి పేస్టు – 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర తరిగింది – 2 టేబుల్ స్పూన్లు, నూనె – అర కప్పు, ఉప్పు – తగినంత.
చేపల ఇగురు తయారు చేసే విధానం..
ముందుగా చేప ముక్కల్ని కడిగి వాటికి అర టీస్పూన్ చొప్పున పసుపు, ఉప్పు, కారం పట్టించి అరగంట సేపు పక్కన పెట్టాలి. తరువాత కాగిన నూనెలో ముక్కల్ని వేయించి తీయాలి. అదే బాణలిలో మిగిలిన నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగాక, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తరువాత టమాటా ముక్కలు, ఉప్పు వేసి నూనె బయటకు వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి. వేయించిన చేప ముక్కలు వేసి సుమారుగా 10 నిమిషాల పాటు దగ్గరగా అయ్యేవరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లితే సరి. దీంతో రుచికరమైన చేపల ఇగురు తయారవుతుంది. దీన్ని అలాగే తినవచ్చు. లేదా అన్నంలో కలుపుకుని తినవచ్చు.