Jonna Guggillu : చిరు ధాన్యాలు అయినటువంటి జొన్నల వాడకం ప్రస్తుత కాలంలో పెరిగిందని పరిశోధనలు చెబుతున్నాయి. జొన్నలతో మనం ఎక్కువగా రొట్టెలను, ఉప్మాను, గటకను తయారు చేస్తూ ఉంటాం. జొన్నలలో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లను అధికంగా కలిగిన ఆహార పదార్థాలలో జొన్నలు ఒకటి. షుగర్ వ్యాధిని, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో జొన్నలు ఎంతో ఉపయోగపడతాయి. జొన్నలను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ అజీర్తి, మలబద్దకాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.
మన శరీరానికి మేలు చేసే జొన్నలను ఆహారంలో భాగంగా తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జొన్నలతో రొట్టె, గటకనే కాకుండా గుగ్గిళ్లను కూడా తయారు చేసుకోవచ్చు. జొన్న గుగ్గిళ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. జొన్న గుగ్గిళ్లను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న గుగ్గిళ్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్నలు – ఒక పెద్ద కప్పు, నూనె – రెండు టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 3, ఎండు మిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, ఉప్పు – రుచికి తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, నీళ్లు – తగినన్ని.
జొన్న గుగ్గిళ్ల తయారీ విధానం..
ముందుగా జొన్నలను శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత కుక్కర్ లో నానబెట్టిన జొన్నలను, తగినన్ని నీళ్లను పోసి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తరువాత జొన్నలలో ఉండే నీరంతా పోయేలా వడకట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి కాగిన తరువాత తరిగిన పచ్చి మిర్చి, ఉల్లిపాయ, ఎండు మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న జొన్నలను వేసి కలుపుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న గుగ్గిళ్లు తయారవుతాయి. వీటి తయారీలో గరం మసాలాను, ఎండు కొబ్బరి పొడిని కూడా ఉపయోగించవచ్చు. సాయంత్రం సమయాల్లో ఇలా ఆరోగ్యానికి మేలు చేసే జొన్నలతో చేసిన గుగ్గిళ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జొన్నలు జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. కనుక వీటిని తిన్న చాలా సమయం వరకు మనకు ఆకలిగా అనిపించదు. తద్వారా మనం తక్కువగా ఆహారాన్ని తీసుకుంటాం. ఈవిధంగా మనం బరువు తగ్గడంలో జొన్నలు సహాయపడతాయి.