Budamkaya Pachadi : మనకు చాలా తక్కువగా లభించే కూరగాయలల్లో బుడం కాయలు కూడా ఒకటి. ఇవి గ్రామాలలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. బుడం కాయలు దొండకాయల లాగా చిన్నగా ఉంటాయి. ఇవి చూడడానికి దోసకాయల లాగా ఉండడం వల్ల వీటిని బుడం దోసకాయలు అని కూడా అంటుంటారు. ఇవి కూడా దోసకాయ జాతికి చెందినవే. వీటిలో కూడా క్యాలరీలు తక్కువగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడంతోపాటు శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బుడం కాయలలో పొటాషియం, కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్ లతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. బుడంకాయలతో పప్పును, కూరను, పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. బుడంకాయలతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని రోట్లో తయారు చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. రోట్లో వేసి బుడంకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బుడంకాయ రోటి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
బుడం కాయలు – అర కిలో, పచ్చి మిరపకాయలు – 20, తరిగిన ఉల్లిపాయలు – 2 (పెద్దవి), నానబెట్టిన చింతపండు – 30 గ్రా., పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, పల్లీలు – ఒక కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
బుడంకాయ రోటి పచ్చడి తయారీ విధానం..
ముందుగా బుడంకాయలను శుభ్రంగగా కడిగి గుండ్రటి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో పల్లీలను వేసి వేయించి పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే కళాయిలో నూనె వేసి పచ్చి మిరపకాయలను వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత బుడంకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక రోట్లో ముందుగా పల్లీలను వేసి మెత్తగా చేసి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత వేయించిన పచ్చి మిర్చి, బుడం కాయలను వేసి దంచుకోవాలి. తరువాత నానబెట్టిన చింతపండును, ఉప్పును, పసుపును వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తరువాత మెత్తగా చేసుకున్న పల్లీలను, తరిగిన ఉల్లిపాయలను వేసి మరలా దంచుకోవాలి. పచ్చడి మరీ గట్టిగా ఉంటే చింతపండును నానబెట్టిన నీళ్లను వేసి కలిపి గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బుడం కాయ రోటి పచ్చడి తయారవుతుంది. దీనిని మిక్సీ జార్ లో వేసి కూడా తయారు చేసుకోవచ్చు. అన్నం, దోశ వంటి వాటితో కలిపి ఈ పచ్చడిని తింటే చాలా రుచిగా ఉంటుంది. బుడంకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.