Chickpeas : మనం చాలా కాలం నుండి వంటింట్లో ఉపయోగించే వాటిల్లో శనగలు ఒకటి. శనగలను ఆహారంలో భాగంగా చేసుకవడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పోషకాలను అధికంగా కలిగి ఉన్న వాటిల్లో శనగలు ఒకటి. ప్రోటీన్ లు అధికంగా లభించే వృక్ష సంబంధమైన ఆహారాల్లో శనగలు ఒకటి. బరువు తగ్గడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో శనగలు ఎంతో సహాయపడతాయి. శనగలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అజీర్తి సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
మెదడు పని తీరును మెరుగుపరచడంలో కూడా శనగలు ఉపయోగపడతాయి. శనగలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. శనగలతో మనం రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. శనగలను మొలకలుగా చేసుకుని కూడా తింటూ ఉంటారు. మనలో చాలా మంది శనగలను గుగ్గిళ్లుగా చేసుకుని కూడా తింటూ ఉంటారు. శనగలతో చేసిన గుగ్గిళ్లు ఎంతో రుచిగా ఉంటాయి. శనగలతో గుగ్గిళ్లను ఎలా తయారు చేసుకోవాలి.. వాటికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శనగల గుగ్గిళ్లు తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగలు – 200 గ్రా., నూనె – ఒక టేబుల్ స్పూన్, ఎండు మిరపకాయలు – 4, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – చిటికెడు, నీళ్లు – తగినన్ని, ఉప్పు – రుచికి సరిపడా.
శనగల గుగ్గిళ్లు తయారీ విధానం..
ముందుగా శనగలను శుభ్రంగా కడిగి ఆరు నుండి ఏడు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కానీ కుక్కర్ లో కానీ నానబెట్టుకున్న శనగలను వేసి తగినన్ని నీళ్లతోపాటుగా రుచికి సరిపడా ఉప్పును వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. శనగలు ఉడికిన తరువాత నీటి నుండి వేరు చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగాక మిగిలిన పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపును ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలల్లో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగల గుగ్గిళ్లు తయారవుతాయి. శనగలతో చేసిన ఈ గుగ్గిళ్లు ఎంతో బలవర్దకమైన ఆహారం. సాయంత్రం సమయాలతో శరీరానికి హాని చేసే పదార్థాలను తినడం కంటే ఇలా శనగల గుగ్గిళ్లను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.