Ragi Laddu : ప్రస్తుత కాలంలో చిరు ధాన్యాలైన రాగులను వాడే వారు రోజురోజుకీ ఎక్కువవుతున్నారు. రాగులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. రాగులలో శరీరానికి అవసరమయ్యే అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. రాగులను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్త హీనతను తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి.
నాడీ వ్యవస్థ పని తీరును మెరుగుపరచడంలో కూడా రాగులు ఉపయోగపడతాయి. ఆరోగ్యంగా బరువు తగ్గడంలో రాగులు దోహదపడతాయి. మనం రాగి పిండిని ఉపయోగించి జావ, రొట్టెలు వంటి వాటిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం. అయితే రాగి పిండితో ఎంతో రుచిగా ఉండే లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. రాగి పిండితో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి పిండి లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి పిండి – ఒక కప్పు, తరిగిన జీడి పప్పు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన బాదం పప్పు – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము- అర కప్పు, పల్లీలు – అర కప్పు, కాచి చల్లార్చిన పాలు – అర లీటర్, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
రాగి పిండి లడ్డూ తయారు చేసే విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలు, జీడి పప్పు, బాదం పప్పు వేసి వేయించుకోవాలి. వీటిని ఒక జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక రాగి పిండిని వేసి చిన్న మంటపై 10 నిమిషాల అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం తురుమును వేసి కలుపుకోవాలి. తరువాత యాలకుల పొడి, ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని పాలను పోస్తూ కలుపుకుంటూ.. కావల్సిన పరిమాణంలో లడ్డూలలా తయారు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి పిండి లడ్డూలు తయారవుతాయి. రోజుకి ఒకటి లేదా రెండు లడ్డూలను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.