ఆ శ్రీవారు రోజూ తన శ్రీమతిని ఇంట్లో ఉండి ఏం ఊడబొడుస్తున్నావు? అని సతాయిస్తుంటాడు. ఒకరోజు అతడు ఆఫీసు నుంచి తిరిగొచ్చేసరికి పిల్లలు ఇంకా నైట్ డ్రెస్సులతో మట్టిలో ఆడుకుంటూ కనిపించారు. గుమ్మంలో ఖాళీ లంచ్ బాక్సులు, వాటి కవర్లు చెల్లాచెదురుగా పడి వున్నాయి. పక్కనే సైకిల్ పడిపోయి కనపడింది. దాని చెయిన్ ఊడి పడి వుంది. అతనికేమీ అర్థం కాలేదు. తన శ్రీమతి కేమైనా అయ్యిందా అని కంగారు పడ్డాడు. లోపలికెళ్ళాడు. డ్రాయింగ్ రూమ్లో టీవీ సౌండ్ పెద్దగా మ్రోగుతోంది. ఆ ప్రక్కనే అతని చిన్న కూతురు గట్టిగా అరుస్తూ సోఫానెక్కి ఎగురుతోంది. అతడిని చూడగానే భయంతో సోఫా దిగి అక్కడ్నించి ప్రక్క గదిలోనికి పారిపోయింది. గదంతా చిందరవందరగా కనిపించిదతనికి.
అతడిలో ఆదుర్దా హెచ్చింది. గబగబా మెట్లెక్కి బెడ్రూమ్ వైపు పరుగుతీశాడు. తలుపు దగ్గరగా వేసి వుంది. వేగంగా నెట్టాడు. పెద్దగా చప్పుడు చేస్తూ తలుపు తెరుచుకుంది. అక్కడి దృశ్యం చూసి అతగాడు నోరు తెరుచుకుని నిలబడిపోయాడు.
అతడి శ్రీమతి చాలా రిలాక్సుడుగా పడుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు హమ్ చేసుకుంటోంది. ఆమెను సమీపించి, ఆమె భుజాన్ని తట్టేసరికి ఆమె మెల్లగా కళ్ళను తెరిచి చాలా కూల్ గా మందహాసం చేస్తూ హెడ్ ఫోన్స్ తొలగించి, అతన్ని చూసి ఏమీ ఎరగనట్లు కళ్ళను ఎగరేసింది.
ఇల్లంతా ఇలా ఉందేమిటి? అని అడిగాడు. రోజంతా ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు అని రోజూ నన్ను సతాయిస్తున్నారుగా! నేనేమీ చెయ్యకపోతే, ఇల్లెలా ఉంటుందో మీకు చూపెడదామనీ… అన్నదా శ్రీమతి. దెబ్బకి శ్రీవారికి మాటలే కరువయ్యాయి!