Oats Idli : రోజూ చాలా మంది ఉదయం చేసే బ్రేక్ ఫాస్ట్‌లలో ఇడ్లీ ఒకటి. ఇడ్లీ అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. అయితే దీన్ని మరింత రుచికరంగా చేసుకోవడంతోపాటు దీని ద్వారా శరీరానికి పోషకాలను కూడా అందించాలని చూసేవారికి ఓట్స్ ఇడ్లీలు చక్కగా సరిపోతాయని చెప్పవచ్చు. ఓట్స్‌ను తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే ఓట్స్‌ను నేరుగా తినలేరు. కానీ ఇడ్లీల రూపంలో చేసుకుని తింటే రుచిగా ఉంటాయి. దీంతో పోషకాలు, ఆరోగ్యం రెండూ లభిస్తాయి. మరి ఓట్స్ ఇడ్లీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఓట్స్ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – 2 కప్పులు, పుల్లని పెరుగు – 2 కప్పులు, ఆవాలు – 1 టీస్పూన్, మినప పప్పు – 1 టేబుల్ స్పూన్, శనగపప్పు – అర టేబుల్ స్పూన్, నూనె – అర టీస్పూన్, పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి), క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము – టేబుల్ స్పూన్, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, ఇనో ఫ్రూట్ సాల్ట్ – చిటికెడు.
ఓట్స్ ఇడ్లీ తయారు చేసే విధానం..
ఒక పాన్ తీసుకుని అందులో ఓట్స్ వేసి కాస్త రంగు మారేవరకు వేయించి తీయాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి పొడిలా చేయాలి. చిన్న పాన్‌లో నూనె వేసి కాగాక ఆవాలు, మినప పప్పు, శనగపప్పు వేసి వేయించాలి. ఇప్పుడు పచ్చి మిర్చి, కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము, పసుపు వేసి ఓ నిమిషం వేగాక దించి ఓట్స్ పొడిలో కలపాలి. అందులోనే పెరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి ఇడ్లీ మిశ్రమంలా చేయాలి. ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి సుమారుగా 15 నిమిషాల పాటు ఉడికించి తీయాలి. దీంతో ఓట్స్ ఇడ్లీ రెడీ అవుతుంది. దీన్ని పుదీనా లేదా కొత్తిమీర, పల్లీలు, కొబ్బరి చట్నీల్లో తినవచ్చు.
ఓట్స్‌లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఓట్స్ ఇడ్లీలను తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గడంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మలబద్దకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.