Ayurvedic Herbs To Reduce Hair Fall : ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. జన్యు పరమైన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, మెడికల్ కండిషన్స్, ఒత్తిడి, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో పలు ఆయుర్వేద మూలికలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిల్లో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు కుదుళ్లకు పోషణను అందిస్తాయి. దీంతో చుండ్రు, ఇన్‌ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తగ్గుతాయి. ఫలితంగా జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇక జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే ఆ ఆయుర్వేద మూలికలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను దృఢ పరుస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు తెల్లగా మారకుండా చూస్తాయి. ఉసిరికాయల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉసిరికాయ పొడితో హెయిర్ మాస్క్ తయారు చేసి దీన్ని జుట్టుకు బాగా పట్టించి 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మీ శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.
అద్భుతాలు చేసే భృంగరాజ్..
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో భృంగరాజ్ ఎంతో అద్భుతమైన ఆయుర్వేద మూలిక అని చెప్పవచ్చు. దీన్ని జుట్టు పెరుగుదలకు గాను కింగ్ ఆఫ్ హెర్బ్స్ అని కూడా పిలుస్తారు. ఇది కుదుళ్లలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. దీంతో జుట్టుకు పోషణ లభించి జుట్టు పెరుగుతుంది. భృంగరాజ్‌కు చలువ చేసే గుణం ఉంటుంది. అందువల్ల తలకు ఉపయోగిస్తే తల చల్లగా ఉంటుంది. దీంతో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి కూడా జుట్టు రాలేందుకు కారణం అవుతుంది. కనుక భృంగరాజ్‌ను వాడితే ఒత్తిడిని తగ్గించుకోవడంతోపాటు జుట్టు రాలడాన్ని కూడా నివారించవచ్చు. భృంగరాజ్ మనకు ఆయిల్ రూపంలో లభిస్తుంది. దీన్ని జుట్టుకు మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.
బ్రహ్మి అనే మూలిక కూడా జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చుండ్రును నివారిస్తుంది. ఇది మనకు ప్రశాంతమైన ఫీలింగ్‌ను ఇస్తుంది. దీంతో ఒత్తిడి కూడా తగ్గుతుంది. మనకు మార్కెట్‌లో బ్రహ్మి పొడి లభిస్తుంది. దీన్ని నీటితో కలిపి పేస్ట్‌లా చేసి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించలి. 30 నుంచి 60 నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ఫలితం ఉంటుంది. అయితే బ్రహ్మి నూనె కూడా మనకు లభిస్తుంది. దీన్ని కూడా మనం ఉపయోగించవచ్చు.
వేపాకులతోనూ..
శిరోజాల సమస్యలను తగ్గించడంలో వేపాకులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వేపాకుల పేస్ట్ లేదా వేప నూనెను మనం ఉపయోగించవచ్చు. వీటిని వాడడం వల్ల కుదుళ్లలో ఉండే ఇన్‌ఫెక్షన్లు, దురద తగ్గుతాయి. దీంతోపాటు చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. వేపాకుల పేస్ట్‌ను నేరుగా తలకు పట్టించవచ్చు. అదే వేప నూనె అయితే ఇతర ఏదైనా నూనెతో కలిపి వాడాలి. తలకు బాగా పట్టించాక 60 నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
శీకాకాయ జుట్టుకు నాచురల్ క్లీన్సర్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చుండ్రును నివారిస్తుంది. కుదుళ్లపై ఇది చాలా మృదువుగా పనిచేస్తుంది. అందువల్ల తల నుంచి సహజంగా ఉత్పత్తి అయ్యే నూనెపై ఎలాంటి ప్రభావం పడదు. దీంతో జుట్టు ఎల్లప్పుడూ మృదువుగా ఉంటుంది. శీకాకయ పొడిని నీటితో కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని జుట్టుకు బాగా పట్టించాలి. 10 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
అశ్వగంధను కూడా వాడవచ్చు..
అశ్వగంధ మూలిక గురించి చాలా మందికి తెలిసిందే. ఇది ఒత్తిడి, హార్మోన్ అసమతుల్యతలను తగ్గిస్తుంది. జుట్టు కుదుళ్లలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి. దీని వల్ల జుట్టు పెరుగుతుంది. అశ్వగంధ పొడిని ఏదైనా నూనెతో కలిపి పేస్ట్‌లా చేసి జుట్టుకు బాగా పట్టించాలి. 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అయితే మార్కెట్‌లో మనకు అశ్వగంధ ట్యాబ్లెట్లు కూడా లభిస్తున్నాయి. కనుక వీటిని కూడా తీసుకోవచ్చు. అయితే వీటిని డాక్టర్ సలహా మేరకు వాడడం మంచిది.
కలబంద జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ఎంతగానో సహాయపడుతుంది. చుండ్రును తగ్గిస్తుంది. జుట్టు కుదుళ్లలో పీహెచ్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. జుట్టు కుదుళ్లలో సహజంగానే చాలా మందికి వచ్చే దురద, ఇన్‌ఫెక్షన్‌లను తగ్గిస్తుంది. కలబంద గుజ్జును నేరుగా జుట్టు కుదుళ్లకు పట్టించవచ్చు. తరువాత 30 నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. దృఢంగా మారుతుంది. కాంతివంతంగా తయారవుతుంది. కనుక జుట్టు సమస్యలు ఉన్నవారు ఈ ఆయుర్వేద మూలికలను తరచూ ఉపయోగించవచ్చు. దీంతో సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.