Monsoon Health Tips : వేసవి కాలంలో మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు సహజంగానే చాలా మంది వర్షాలు పడాలని కోరుకుంటారు. అయితే ఎప్పటిలాగే ప్రతి ఏడాది కూడా వర్షాకాలం వచ్చేస్తుంది. కానీ ఈ సీజన్‌లో వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ అనేక రోగాలను మోసుకొస్తుంది. కనుక ఏడాదిలో ఈ సీజన్‌లో మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనేక రోగాల బారిన పడతాం. ఈ సీజన్‌లో గనుక కొన్ని ముందస్తు జాగ్రత్తలను తీసుకున్నట్లయితే మనం రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటాము. ఇక ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ఇంటి చుట్టు పక్కల లేదా ఇంట్లో ఎక్కడైనా సరే నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. పాత టైర్లు, కూలర్లు, పూల కుండీలు వంటి చోట్ల నీరు నిల్వ ఉంటుంది. సాధారణంగా ఈ చోట్లలోనే దోమలు గుడ్లను పెట్టి ఉత్పత్తి చేస్తుంటాయి. కనుక నీటిని నిల్వ ఉంచకూడదు. లేదంటే దోమల సంఖ్య పెరిగి మీకు రోగాలను తెచ్చి పెడతాయి. అలాగే ఈ సీజన్‌లో మీరు ఎట్టి పరిస్థితిలోనూ బయటి ఫుడ్‌ను తినకూడదు. బయటి ఫుడ్‌లో ఈ సీజన్‌లో అనేక బాక్టీరియా, వైరస్‌లు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బయటి ఫుడ్‌ను సాధారణంగా అపరిశుభ్రమైన వాతావరణంలో విక్రయిస్తారు. కనుక అలాంటి ఫుడ్‌ను తింటే ఈ సీజన్‌లో వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
బయటి ఆహారం వద్దు..
కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల విరేచనాలు, వాంతులు అవడంతోపాటు టైఫాయిడ్ వంటి జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక వీలున్నంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్నివేడిగా తినడమే ఉత్తమం. అలాగే మీరు రోజూ తాగే నీళ్లను తప్పకుండా మరిగించి తాగాలి. దీని వల్ల నీటిలో ఉండే క్రిములు నశిస్తాయి. రోగాలు రాకుండా ఉంటాయి. అలాగే బయటకు వెళ్లే సమయంలో సన్ స్క్రీన్ లోషన్‌ను రాసుకోవాలి. దీంతో చర్మానికి రక్షణ లభిస్తుంది.
ఈ సీజన్‌లో మనకు దోమకాటు వల్ల ఎక్కువ రోగాలు వస్తాయి. కనుక దోమల నుంచి సురక్షితంగా ఉండాలి. ముఖ్యంగా సాక్సులతో సహా షూస్ ధరించాలి. అలాగే శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరిస్తే దోమలు కుట్టకుండా జాగ్రత్తపడవచ్చు. పిల్లలకు కూడా అలాంటి దుస్తులనే వేయాలి. సాయంత్రం అయిన తరువాత బయట తిరగకూడదు. దీనివల్ల దోమలు కుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక డెంగ్యూ వంటి దోమలు పగటిపూటే ఎక్కువగా కుడతాయి. కనుక పగటిపూట మీ చుట్టూ ఏవైనా దోమలు తిరుగుతుంటే అనుమానించాల్సిందే. వెంటనే ఆ దోమలను తరిమే పని చేయాలి.
దోమలను ఇలా తరిమేయండి..
దోమలను తరిమేందుకు మీరు మస్కిటో రీపెల్లెంట్స్, కాయిల్స్ వాడవచ్చు. అయితే ఇవి ఆరోగ్యానికి హానికరం అనుకుంటే నాచురల్ రీపెల్లెంట్స్ సైతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా వాడవచ్చు. లేదా శరీరానికి రాసుకునే క్రీమ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక దోమలు కుట్టవద్దు అనుకుంటే, వాటిని నిర్మూలించాలంటే దోమల బ్యాట్ అన్నింటికన్నా శ్రేయస్కరం. దీంతో దోమలు వెంటనే చనిపోతాయి. దీని వల్ల దోమల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. అలాగే దోమలు కుట్టకుండా ఉండాలంటే దోమ తెరలను కూడా వాడవచ్చు.
మీ ఇల్లు లేదా ఇంటి బయట పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. చెత్త చేరితే అందులో దోమలు గుడ్లను పెట్టి పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. దీంతో మీకు దోమల బెడద ఎక్కువవుతుంది. కనుక ఇంటిని, ఇంటి పరిసరాలను చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు పోగయ్యే చెత్త, వ్యర్థాలను వెంటనే పడేయాల్సి ఉంటుంది. ఇలా కొన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల ఈ సీజన్‌లో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. వాటి నుంచి సులభంగా బయట పడవచ్చు.