Heart Health : గుండె మన శరీరంలో ముఖ్యమైన భాగం. ఇది శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్, పోషకాలను అందిస్తూ రక్తాన్ని పంపుతుంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించడానికి గుండె సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే ఆహారం, మూలికలు, వ్యాయామం, ధ్యానం వంటివి గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన మూలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో అర్జున బెరడు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బెరడు పొడి గుండెకు మేలు చేస్తుంది. ఇది హార్ట్ టానిక్‌గా పనిచేస్తుంది, గుండె కండరాలను బలపరుస్తుంది. ఇది అధిక రక్తపోటు స్థాయిలని తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల అర్జున బెరడు పొడిని రోజూ ఉదయం, సాయంత్రం అర టీస్పూన్ మోతాదులో తేనెతో కలిపి తీసుకోవాలి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
2. అమలకి. దీన్నే ఉసిరి అంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, అనాల్జెసిక్, గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ లక్షణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కాలేయం, గుండె జబ్బులు, గ్యాస్ట్రిక్ అల్సర్, షుగర్ వంటి అనేక వ్యాధులకు ఉసిరిక పొడిని ఉపయోగిస్తారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల ఉసిరిక పొడిని రోజూ తీసుకోవాలి. దీన్ని కూడా తేనెతో తీసుకోవచ్చు.
3. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే మరో మూలిక మునగాకు. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. మునగ ఆకులు, కాయలు, పువ్వులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. మునగాకుల రసాన్ని రోజూ ఉదయం పరగడుపున 30 ఎంఎల్ మోతాదులో తాగుతుండాలి. మునగాకుల కూర కూడా తినవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
4. అవిసె గింజలలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండె జబ్బులు ఉన్నవారికి మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల అవిసె గింజలను రోజూ గుప్పెడు మోతాదులో తింటుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
5. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కర్కుమిన్ కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ మూలికలు నేరుగా మన గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల వీటిని తీసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.