Amla For Black Hair : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మారిన మన ఆహారపు అలవాట్లే జుట్టు తెల్లబడడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. జుట్టు కుదుళ్లకు తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల అలాగే ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి వాటి కారణంగా జుట్టు తెల్లబడుతూ ఉంటుంది. తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకోవడం కోసం చాలా మంది హెయిర్ డైలను వాడుతూ ఉంటారు. ఈ హెయిర్ డైలలో రసాయనాలు అధికంగా ఉంటాయి. వీటిని వాడడం వల్ల తాత్కాలిక ఫలితమే ఉంటుంది. అలాగే వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల దురద, దద్దుర్లు, వంటి చర్మ సంబంధిత సమస్యలతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి చిట్కాను ఉపయోగించి కూడా మనం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
ఈ చిట్కాను తయారు చేసుకోవడం చాలా సులభం. అలాగే దీనిని ఉపయోగించడం కూడా చాలా సులభం. తెల్ల జుట్టును నల్లగా మార్చే ఇంటి చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ చిట్కాను ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం కేవలం రెండే రెండు పదార్థాలను ఉపయోగించాల్సి ఉంటుంది. కేవలం ఉసిరికాయ, కొబ్బరి నూనెను ఉపయోగించి తెల్లజుట్టును మనం నల్లగా మార్చుకోవచ్చు. దీనికోసం ముందుగా 6 ఉసిరి కాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వాటిలో ఉండే గింజ తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 50 గ్రాముల కొబ్బరి నూనెను తీసుకుని వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉసిరికాయ ముక్కలను వేసి నల్లగా అయ్యే వరకు వేడి చేయాలి.
తరువాత ఈ నూనెను వడకట్టి గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను రోజూ రాత్రి పడుకునే ముందు జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు రాసుకోవాలి. తరువాత నూనె చర్మంలోకి ఇంకేలా సున్నితంగా మర్దనా చేయాలి. ఉదయాన్నే రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది. అలాగే చుండ్రు, జుట్టు రాలడం, పేలు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఉసిరికాయలోని ఔషధ గుణాలు అలాగే కొబ్బరి నూనెలో ఉండే పోషకాలు జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరిగేలా చేయడంలో సహాయపడతాయి. గ్రే హెయిర్, తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వారుఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.