Carrot Pachadi : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యారెట్ ఒకటి. క్యారెట్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలుసు. క్యారెట్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కంటి చూపుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. జర్ణక్రియ వేగవంతం అవుతుంది. బీపీ మరియు షుగర్ నియంత్రణలో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యారెట్ ను జ్యూస్ రూపంలో తీసుకోవడంతో పాటు వివిధ రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే క్యారెట్ తో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. క్యారెట్ పచ్చడి చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ క్యారెట్ పచ్చడిని మరింత రుచిగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన క్యారెట్ – 3( పెద్దవి), తరిగిన టమాటాలు – 4, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, ఉప్పు – తగినంత, నూనె – 2 టీ స్పూన్స్, పసుపు – చిటికెడు, ఎండుమిర్చి – 4, ధనియాలు – ఒక టీ స్పూన్, నువ్వులు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, వెల్లుల్లి రెబ్బలు – 4, చింతపండు – ఒక రెమ్మ.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్.
క్యారెట్ టమాట పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక క్యారెట్ ముక్కలు, పసుపు వేసి కలుపుతూ వేయించాలి. క్యారెట్ ముక్కలు కొద్దిగా వేగిన తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ధనియాలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత నువ్వులు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి క్యారెట్ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. ఈ టమాట ముక్కలను మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని చల్లారే వరకు ఉంచి ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ టమాట పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నం, దోశ, ఇడ్లీ, ఊతప్పం వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యారెట్ ను తినని వారికి ఈ విధంగా పచ్చడిని చేసి పెట్టడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించవచ్చు.