Masala Tomato Rice : టమాటాలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మన అందంతో పాటు ఆరోగ్యానికి కూడా టమాటాలు ఎంతో మేలు చేస్తాయి. టమాటాలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. టమాటాలతో చేసే వివిధ రకాల వంటకాల్లో టమాట రైస్ ఒకటి. టమాట రైస్ ను మనం విరివిరిగా తయారు చేస్తూ ఉంటాం. దీనిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. ఈ టమాట రైస్ ను మరింత రుచిగా, మరింత సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట మసాలా రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతీ బియ్యం – 2 గ్లాసులు (200 గ్రా.), నీళ్లు – 4 గ్లాసులు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 2, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాటాలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన పచ్చిమిర్చి – 4, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, పుదీనా – రెండు టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత.
టమాట మసాలా రైస్ తయారీ విధానం..
ముందుగా బాస్మతీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి 4 గ్లాసుల నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. తరువాత కారం, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసి వేయించాలి. తరువాత నానబెట్టుకున్న బాస్మతీ బియ్యాన్ని నీటితో సహా వేసుకోవాలి. తరువాత ఇందులో తగినంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి.
దీనిని సాధారణ అన్నం వండుకున్నట్టు వండుకుని స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల పాటు కదిలించకుండా అలాగే ఉంచాలి. తరువాత దీనిని అంతా ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట మసాలా రైస్ తయారవుతుంది. నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం లేనప్పుడు ఇలా రుచిగా చాలా సులభంగా టమాట మసాలా రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు.