Beauty Tips : మన ముఖం అందంగా కనబడేలా చేయడంలో పెదవులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మన పెదవులు అందంగా ఉంటేనే మన ముఖం చక్కగా కనబడుతుంది. పెదవులు ఎర్రగా, అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ కొందరిలో పెదవులు నల్లగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. హార్మోన్ల అసమతుల్యత, వాతావరణ కాలుష్యం, ఎండలో ఎక్కువగా తిరగడం వంటి కారణాల వల్ల పెదవులు నల్లగా మారతాయి. ఈ నలుపును కప్పి పుచుకోవడానికి, అలాగే పెదవులు అందంగా కనబడడానికి రకరకాల లిప్ స్టిక్ లను వాడుతూ ఉంటారు.
కొన్ని రకాల లిప్ స్టిక్ లను వాడడం వల్ల పెదవులకు మరింత హాని కలుగుతుంది. లిప్ స్టిక్ లను వాడకుండా కొన్ని రకాల చిట్కాలను ఉపయోగించి సహజసిద్ధంగానే మనం పెదవులు ఎర్రగా, ఆరోగ్యంగా, అందంగా కనబడేలా చేసుకోవచ్చు. పెదవులపై ఉండే నలుపును పోగొట్టి పెదవులను అందంగా మార్చే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మరసంలో పంచదారను, కొబ్బరి నూనెను కలిపి పెదవులపై సున్నితంగా రాసి 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పెదవులపై ఉండే నలుపు, మృత కణాలు తొలగిపోయి పెదవులు అందంగా కనబడతాయి.
పాల మీగడలో బీట్ రూట్ రసాన్ని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పెదవులు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. గంధాన్ని, పసుపును కలిపి పెదవులకు రాయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. గులాబి రేకులను, తేనెను కలిపి మెత్తగా పేస్ట్ గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై రాసి 20 నిమిషాల తరువాత కడిగేయడం వల్ల పెదవులపై ఉండే నలుపు తొలగిపోతుంది.
రాత్రి పడుకునే ముందు పెదవులకు పాల మీగడ రాసి ఉదయాన్నే కడిగేయడం వల్ల పెదవులపై ఉండే నలుపు తగ్గి పెదవులు పొడిబారకుండా ఉంటాయి. బొప్పాయి పండును మెత్తగా చేసి ఆ మిశ్రమాన్ని పెదవులకు రాసి 20 నిమిషాల తరువాత కడిగేయడం వల్ల పెదవుల నలుపు తగ్గుతుంది. ఒక టీ స్పూన్ స్ట్రాబెర్రీ రసంలో 2 టీ స్పూన్ల పెట్రోలియం జెల్లీని కలిపి పెదవులకు రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల పెదవుల నలుపు తగ్గడంతోపాటు పెదవులు సహజసిద్ధంగా ఎర్రగా కనబడతాయి. అంతేకాకుండా పెదవులు పొడిబారకుండా ఆరోగ్యంగా ఉంటాయి.