Beauty Tips : మనలోచాలా మంది ముఖం కాంతివంతంగా.. అందంగా.. ఉండాలని ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. అధిక ధరలతో కూడిన సౌందర్య సాధనాలను వాడడంతోపాటు తరచూ బ్యూటీ పార్లర్ లకు కూడా వెళ్తూ ఉంటారు. ఇది అంతా కూడా అధిక వ్యయంతో కూడుకున్న పని. ముఖాన్ని కాంతివంతంగా ఉంచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం ఇంటి చిట్కాలను ఉపయోగించి ముఖాన్ని, అందంగా, కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. ముఖాన్ని అందంగా మార్చే ఇంటి చిట్కాలు ఏమిటి.. వీటిని ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖం కాంతివంతంగా ఉండాలని కోరుకునే వారు పసుపును, గంధాన్ని సమపాళ్లలో తీసుకుని కొద్దిగా నీటిని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకుని ఆరిన తరువాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం నిగారింపును సొంతం చేసుకుంటుంది. మనం ఆహారంగా తీసుకునే పెరుగు సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుందని మనకు తెలుసు. ఈ పెరుగును రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకుని అందులో నాలుగు చుక్కల వెనిగర్ ను కలిపి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత కడిగేయడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
అలాగే రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జులో ఒక టీ స్పూన్ కీరదోస గుజ్జును, చిటికెడు పసుపును, నిమ్మ రసాన్ని కలిపి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత కడిగేయడం వల్ల ముఖంపై వచ్చే మొటిము, మచ్చలు తగ్గి ముఖం అందంగా కనబడుతుంది. పాల మీగడలో తేనెను వేసి బాగా కలిపి ముఖానికి రాసుకుని 30 నిమిషాల తరువాత కడిగేయడం వల్ల ముఖం మెరుస్తూ కనబడుతుంది. రెండు టీ స్పూన్ల పంచదారలో ఆలివ్ నూనెను, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉపయోగించే పంచదార స్క్రబర్ లా పనిచేసి ముఖంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది. దీంతో ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
ఈ చిట్కాలను తరచూ పాటించడం వల్ల మొటిమలు, మచ్చలు, ముడతలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా, అందంగా కనబడుతుతుంది. ఈచిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ర్పభావాలు లేకుండానే చాలా తక్కువ ఖర్చుతో ముఖం నిగారించేలా చేసుకోవచ్చు.