Curd Face Pack : మనం పెరుగును ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. పెరుగులో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ తోపాటు శరీరానికి మేలు చేసే బాక్టీరియా కూడా ఉంటుంది. దీనిలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో, బీపీని నియంత్రించడంలోనూ పెరుగు ఉపయోగపడుతుంది. పెరుగును మజ్జిగ, లస్సీ రూపంలో కూడా తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వేడి తగ్గి శరీరానికి చలువ చేస్తుంది. అనేక రకాల వంటల తయారీలో కూడా మనం పెరుగును వాడుతూ ఉంటాం. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా సౌందర్య సాధనంగా కూడా పెరుగు ఉపయోగపడుతుంది.
పెరుగుతో ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు తగ్గి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పెరుగును ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం పొడిబారకుండా చేయడంలో పెరుగు సహాయపడుతుంది. పెరుగును వాడడం వల్ల చర్మం తెలుపుగా, మృదువుగా తయారవుతుంది. పెరుగును ఉపయోగించి చర్మంపై ఉండే మృతకణాలను తొలగించవచ్చు. ఒక కప్పు పెరుగులో శనగ పిండి, కొద్దిగా పసుపును వేసి కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకుని 20 నిమిషాల తరువాత కడగడం వల్ల మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
ముఖం పై ఉండే నలుపును, నల్లటి వలయాలను తొలగించడంలోనూ పెరుగు దోహదపడుతుంది. పెరుగులో బియ్యం పిండిని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్ లా వేసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా తరచూ చేయడ వల్ల ముఖంపై ఉండే నలుపు తగ్గుతుంది. అంతే కాకుండా చర్మంపై ముడతలు కూడా తగ్గుతాయి.
ఒక టీ స్పూన్ పెరుగులో ఒక టీ స్పూన్ టమాట గుజ్జును, తేనెను కలిపి ముఖానికి రాసి 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే నల్లని మచ్చలు క్రమేణా తగ్గుతాయి. పెరుగులో కలబంద గుజ్జును కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
చర్మ సౌందర్యం కోసం మనం బయట దొరికే అనేక రకాల ప్రోడక్ట్ప్ ను వాడుతూ ఉంటాం. ఇవి అధిక ఖర్చుతో కూడినవి. వాటికి బదులుగా సహజ సిద్దంగా తక్కువ ఖర్చులో పెరుగును ఉపయోగించి మనం మన ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. పెరుగును వాడడం వల్ల చర్మానికి ఎటువంటి హాని కలగదని, చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుందని.. నిపుణులు తెలియజేస్తున్నారు.