Facepack For Glow : ముఖం అందంగా, ప్రకాశవంతంగా కనబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దీని కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికి చాలా మందిలో ముఖం నిర్జీవంగా కనిపిస్తుంది. చర్మం పొడిబారినట్టు కనిపిస్తుంది. చర్మంపై మృతకణాలు పేరుకుపోవడం కూడా దీనికి ఒక కారణం. చనిపోయిన చర్మ కణాలు ముఖంపై పేరుకుపోవడం వల్ల ముఖం అందవిహీనంగా కనబడుతుంది. నీటిని తక్కువగా తాగడం, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం వంటి వివిధ కారణాల చేత ఇలా జరుగుతుంది. మృత కణాలు పేరుకుపోవడం వల్ల మనం మొటిమలు, మచ్చలు, చర్మం కాంతి తగ్గడం వంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా చర్మంపై చుండ్రు వంటి పొలుసులు కూడా ఏర్పడతాయి. చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. కనుక మనం ముఖంపై నశించిన చర్మ కణాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి.
చాలా మంది వివిధ రకాల ఫేస్ స్క్రబర్ లను వాడుతూ ఉంటారు. అయితే వీటిలో రసాయనాలు ఉండే అవకాశం ఉంటుంది. వీటిని తరుచూ వాడడం అంత మంచిది కూడా కాదు. వీటికి బదులుగా ఇంట్లోనే ఒక ఫేస్ ప్యాక్ ను తయారు చేసి వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ఫేస్ట్ ప్యాక్ ను వాడడం వల్ల చర్మంపై మృతకణాలు చాలా సులభంగా తొలగిపోతాయి. చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. చర్మం అందంగా తయారవుతుంది. చర్మం పొడిబారడం కూడా తగ్గుతుంది. చర్మంపై మృతకణాలను తొలగించే ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి… దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే దీనిని ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. దీనిని తయారు చేసుకోవడానికి గానూ ఒక టీ స్పూన్ బియ్యం పిండి,అర టీ స్పూన్ కాఫీ పొడి, ఒక టీ స్పూన్ కలబంద జెల్, టమాట రసం, బంగాళాదుంప రసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండిని తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాల్లో రాసుకోవాలి. దీనిని 10 నుండి 15 నిమిషాల వరకు ఉంచాలి. ఇది తడి ఆరిన తరువాత చేతులకు తడి చేసుకుంటూ వృత్తాకారంలో రుద్దుతూ చర్మానికి మర్దనా చేయాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకుని మాయిశ్యరైజర్ ను రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఈ ఫేస్ ప్యాక్ ను వాడడం వల్ల మృతకణాలు తొలగిపోవడంతో పాటు చర్మం కూడా అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.