Garlic Husk : అనేక ఔషధ గుణాలు ఉన్న వెల్లుల్లిని మనం తరచూ వంటల్లో వాడుతూ ఉంటాం. వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. రక్తాన్ని పలుచగా చేసి రక్తం గడ్డకట్టకుండా చేయడమే కాకుండా రక్తాన్ని శుద్ది చేయడంలోనూ వెల్లుల్లి సహాయపడుతుంది. ఎముకలను దృఢంగా చేయడంలో, బీపీని నియంత్రించడంలో, జీర్ణశక్తిని మెరుగుపపరచడంలోనూ వెల్లుల్లి ఉపయోగపడుతుంది.
ప్రేగులు మనం తినే ఆహారం నుండి ఐరన్ ను ఎక్కువగా శోషించుకునేలా చేయడంలో కూడా వెల్లుల్లి దోహదపడుతుంది. కంటి చూపును మెరుగుపచడంలో, దంతాల సమస్యలను తొలగించడంలో కూడా వెల్లుల్లి సహాయపడుతుంది. సహజంగా మనం వెల్లుల్లిని తీసుకుని వెల్లుల్లిపై ఉండే పొట్టును పడేస్తాము. కానీ వెల్లుల్లి పొట్టు కూడా మనకు ఉపయోగపడుతుంది. వెల్లుల్లి పొట్టును ఉపయోగించి మనం మన జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి మనం రకరకాల హెయిర్ డై లను వాడుతూ ఉంటాం. వీటిని వాడడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
వెల్లుల్లి పొట్టును ఉపయోగించి మనం సహజ సిద్దంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఇందుకోసం వెల్లుల్లి పొట్టును ఒక కళాయిలో వేసి పుర్తిగా నల్లగా అయ్యే వరకు వేయించాలి. ఇలా వేయించిన వెల్లుల్లి పొట్టును ఒక జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో కొబ్బరి నూనెను కానీ, ఆముదాన్ని కానీ వేసి కలిపి తలకు బాగా పట్టించి గంట సేపటి తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కలగకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.